రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మరో భారతీయుడి మృత్యువాత

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మరో భారతీయుడు మృత్యువాతపడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 13 Jun 2024 03:40 IST

ఆలస్యంగా వెలుగులోకి.. 

అమృత్‌సర్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మరో భారతీయుడు మృత్యువాతపడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగరానికి చెందిన తేజ్‌పాల్‌ సింగ్‌ రష్యా సైన్యం తరఫున ఉక్రెయిన్‌లో పోరాడుతూ ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. అయితే తేజ్‌పాల్‌ మరణం గురించి తమకు రెండు రోజుల కిందటే సమాచారం అందిందని ఆయన భార్య పర్మిందర్‌ కౌర్‌ బుధవారం విలపిస్తూ తెలిపారు. ‘‘నా భర్త ఉద్యోగాన్వేషణలో భాగంగా నిరుడు డిసెంబరులో థాయిలాండ్‌కు వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు ఉన్నాక.. తన స్నేహితులతో కలిసి జనవరి 12న పర్యాటక వీసాపై రష్యా వెళ్లి ఆ దేశ సైన్యంలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన స్నేహితుడొకరు మాకు ఫోన్‌ చేసి.. ఉక్రెయిన్‌ యుద్ధ క్షేత్రంలో మార్చిలోనే నా భర్త మరణించినట్లు చెప్పారు’’ అని కౌర్‌ వివరించారు. ప్రస్తుతం తేజ్‌పాల్‌ మృతదేహం ఎక్కడుందో కూడా తెలియదంటూ వాపోయారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని అప్పగించాలని రష్యా సైన్యానికి ఈమెయిల్‌ ద్వారా విన్నవించామని పేర్కొన్నారు. తేజ్‌పాల్‌ మరణంతో.. ఇప్పటిదాకా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో పోరాడుతూ మృత్యువాతపడ్డ భారతీయుల సంఖ్య నాలుగుకు పెరిగినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని