సంక్షిప్త వార్తలు (4)

శరణార్థులను స్వీకరించడానికి ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన నియమావళిని ఉల్లంఘించినందుకు హంగరీ 20 కోట్ల యూరోల జరిమానా కట్టాలని, ఇకపైనా ఉల్లంఘిస్తూనే ఉంటే రోజుకు అదనంగా 10 లక్షల యూరోల చొప్పున కట్టాలని యూరోపియన్‌ న్యాయస్థానం (ఈసీజే) గురువారం ఆదేశించింది.

Published : 14 Jun 2024 04:55 IST

హంగరీకి 20 కోట్ల యూరోల జరిమానా
ఈసీజే ఆదేశం

బ్రసెల్స్‌: శరణార్థులను స్వీకరించడానికి ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన నియమావళిని ఉల్లంఘించినందుకు హంగరీ 20 కోట్ల యూరోల జరిమానా కట్టాలని, ఇకపైనా ఉల్లంఘిస్తూనే ఉంటే రోజుకు అదనంగా 10 లక్షల యూరోల చొప్పున కట్టాలని యూరోపియన్‌ న్యాయస్థానం (ఈసీజే) గురువారం ఆదేశించింది. సిరియాతోసహా ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చేవారికి ఈయూలోని 27 దేశాలు ఆశ్రయం ఇవ్వాలని 2020లో ఈసీజే తీర్మానించింది. ఈయూ సభ్య దేశమై ఉండీ హంగరీ దీన్ని అమలు చేయలేదని ఆక్షేపిస్తూ జరిమానా విధించింది. అయితే జరిమానా విధింపు దారుణమని, అది తమకు ఆమోదనీయం కాదని హంగరీ ప్రధాన మంత్రి విక్తొర్‌ ఓర్బన్‌ పేర్కొన్నారు. ఐరోపా పౌరులకన్నా అక్రమ వలసదారులే ఈయూకు ముఖ్యంలా ఉందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 


అమెరికాలో భారత సంతతి అభ్యర్థి అరెస్టు

హ్యూస్టన్‌: డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఫోర్ట్‌బెండ్‌ కౌంటీ కమిషనరు పదవికి పోటీ చేస్తున్న భారత సంతతి అభ్యర్థి తరళ్‌ పటేల్‌ను (30) టెక్సాస్‌ రేంజర్స్‌ బుధవారం అరెస్టు చేశారు. పటేల్‌ ఆన్‌లైన్‌లో తన పేరు మీద కాకుండా వేరే పేరు మీద ఖాతా తెరిచి, తన వివరాలను గోప్యంగా ఉంచారని ఆరోపణలొచ్చాయి. పటేల్‌ తీవ్రమైన నేరానికి పాల్పడినందుకు 20వేల డాలర్ల బాండ్‌ను, అక్రమ ప్రవర్తనకు మరో 2,500 డాలర్ల బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. గురువారంనాటికల్లా చెల్లింపులు జరపకపోతే మేజిస్ట్రేట్‌ ముందు ఆయన హాజరు కావాలి.


ఆ గర్భస్రావ మందులను వాడొచ్చు
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు

వాషింగ్టన్‌: అవాంఛిత గర్భం వచ్చినవారు 10 వారాల్లోపు గర్భ విచ్ఛిత్తి కోసం మైఫిప్రిస్టోన్‌ మందును వాడవచ్చని అమెరికా సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. దాంతోపాటు మైసోప్రొస్టోల్‌ మందునూ వాడటంలో ఇబ్బందేమీ లేదని తెలిపింది. ఈ మందులకు ఎఫ్‌డీఏ అనుమతి ఇవ్వడాన్ని అబార్షన్‌ వ్యతిరేకులు సవాలు చేయలేరని పేర్కొంది. ఈ మందులను వాడటాన్ని ఎఫ్‌డీఏ సులభతరం చేయడంలో తప్పు లేదని స్పష్టం చేసింది. అమెరికాలో 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 60 లక్షల మంది మైఫిప్రిస్టోన్‌ మందును వాడారు. దీంతోపాటు 10 వారాల్లోపు గర్భ విచ్ఛిత్తి కోసం మైసోప్రొస్టోల్‌ను వినియోగించారు. 


వాణిజ్య నౌకలపై హూతీల దాడులు

దుబాయ్‌: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం గ్రీకు నౌకపై పడవ బాంబుతో దాడి చేసిన రెబల్స్‌.. గురువారం మరో నౌకపైకి క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో రెండు నౌకలు దెబ్బతిన్నాయి. 

  • గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ ప్రాంతంలో మలేసియా నుంచి ఇటలీలోని వెనిస్‌కు వెళ్తున్న నౌకపై గురువారం హూతీలు క్షిపణిని ప్రయోగించారు. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. తరువాత మరో నౌకపైనా దాడికి దిగారు. అయితే నౌకకు దూరంగా క్షిపణి పేలడంతో ఎటువంటి నష్టం జరగలేదు. 
  • లైబీరియా జెండాతో వస్తున్న గ్రీకు దేశానికి చెందిన వాణిజ్య నౌకపై బుధవారం హూతీ రెబల్స్‌ పడవ బాంబుతో దాడి చేశారు. బాంబులను పడవలో నింపి నౌకపైకి వదిలారు. అది పేలి మంటలు చెలరేగడంతో నౌక ఇంజిన్‌ ప్రాంతంలో దెబ్బతిందని కెప్టెన్‌ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. 
  • హూతీ రెబల్స్‌ ప్రయోగించిన మరో 3 క్షిపణులను, ఒక డ్రోన్‌ను ఎర్ర సముద్రంలో కూల్చివేశామని అమెరికా సైన్యం వెల్లడించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని