ఎల్‌ నినోకు బై బై.. ఇక లా నినా వంతు

ఇప్పటికే వేడెక్కిన భూగోళంపై ఉష్ణోగ్రతల్ని మరింత పెంచి, వేసవిలో విపరీతమైన భగభగలకు కారణమైన ఎల్‌ నినో వాతావరణ పరిస్థితులు సెలవు తీసుకున్నాయి.

Published : 14 Jun 2024 04:56 IST

వాషింగ్టన్‌: ఇప్పటికే వేడెక్కిన భూగోళంపై ఉష్ణోగ్రతల్ని మరింత పెంచి, వేసవిలో విపరీతమైన భగభగలకు కారణమైన ఎల్‌ నినో వాతావరణ పరిస్థితులు సెలవు తీసుకున్నాయి. ఇక చల్లని లా నినా వంతు వచ్చింది. ఈ విషయాన్ని అమెరికాలోని ‘మహా సముద్ర వాతావరణ జాతీయ సంస్థ’ గురువారం ప్రకటించింది. సుమారు ఏడాది క్రితం ఏర్పడిన ఎల్‌ నినో, మానవ చర్యల వల్ల చోటుచేసుకున్న మార్పులతో 12 నెలలుగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇంతవరకు ప్రతినెలా మునుపటి రికార్డులను తిరగరాసే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచం తటస్థ స్థితిలో ఉంది. ఎల్‌నినో వల్ల పసిఫిక్‌లో ఏయే ప్రాంతాలు వేడెక్కాయో ఆ ప్రాంతాలన్నీ లా నినాలో చల్లబడేందుకు 65% అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దీనికి సానుకూలత ఉందని చెబుతున్నారు. అట్లాంటిక్‌ మహా సముద్రంలో హరికేన్‌లు ఎక్కువగా వచ్చే కాలాన్ని మరింత క్రియాశీలం చేయడం లా నినా ప్రభావాల్లో ఒకటి. ఆగస్టులో హరికేన్‌ల ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు, లా నినా పరిస్థితులు కలిసి అమెరికాలో అసాధారణమైన తుపాన్లు తీసుకువస్తాయని ఉత్తర కరోలినా రాష్ట్ర వాతావరణ నిపుణురాలు కేథే డెలో చెప్పారు. ప్రతి ఎల్‌ నినో, లా నినా భిన్నంగా ఉంటాయని, అందువల్ల ప్రభుత్వం తగిన సన్నద్ధతతో ఉండాలని మరో నిపుణుడు మైఖేల్‌ ఫెరారి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని