పెరుగుతున్న రోజు నిడివి

భూగోళ కేంద్ర భాగ (కోర్‌) భ్రమణ వేగం తగ్గుతోందని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు స్పష్టం చేశారు.

Published : 15 Jun 2024 05:13 IST

దిల్లీ: భూగోళ కేంద్ర భాగ (కోర్‌) భ్రమణ వేగం తగ్గుతోందని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు స్పష్టం చేశారు. దీనివల్ల భూమిపై రోజు నిడివి కొన్ని లీప్‌ సెకండ్ల మేరకు పెరుగుతూ వస్తోందని తెలిపారు. భూమి ఎల్లవేళలా ఒకే వేగంతో భ్రమణం సాగించదు కాబట్టి 1972 నుంచి రోజు నిడివికి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక లీప్‌ సెకండ్‌ చొప్పున కలుపుతూ వస్తున్నారు. భూగోళం కొన్ని పొరలతో నిర్మితమైంది. వాటిలో క్రస్ట్‌ అనేది భూమి పైపొర. దాని కింద మాంటిల్‌ ఉంటుంది. మాంటిల్‌ కింద కోర్‌ (కేంద్ర భాగం) ఉంటుంది. దీన్ని బాహ్య కోర్, లోపలి కోర్‌గా విభజించారు. బాహ్య కోర్‌ ఉత్పన్నం చేసే అయస్కాంత క్షేత్రం, మాంటిల్‌లోని గురుత్వాకర్షణ శక్తి కలగలసి లోపలి కోర్‌ భ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మాంటిల్‌తో పోలిస్తే లోపలి కోర్‌ నెమ్మదిగా భ్రమిస్తోందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. పైగా అది అపసవ్య దిశలో భ్రమిస్తోంది. లోపలి కోర్‌ భ్రమణ వేగం తగ్గగా భూమి ఉపరితలం వేగంగా తిరుగుతోంది. ఫలితంగా రోజు నిడివికి ఇదివరకటికన్నా తక్కువ లీప్‌ సెకన్లను కలపాల్సి వస్తోంది. ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల గ్రీన్‌ ల్యాండ్, అంటార్కిటికాలలో మంచు వేగంగా కరిగిపోతూ భూభ్రమణ వేగాన్ని తగ్గించేస్తోంది. దానివల్ల కూడా రోజు నిడివి పెరుగుతోంది. దీనికి లోపలి కోర్‌ కూడా జత కలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని