ఇజ్రాయెల్‌ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి

దక్షిణ గాజాలో హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్‌పై హమాస్‌ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృత్యువాతకు గురయ్యారు.

Updated : 16 Jun 2024 06:26 IST

8 మంది సైనికుల మృతి

జెరూసలెం: దక్షిణ గాజాలో హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్‌పై హమాస్‌ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృత్యువాతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) ధ్రువీకరించింది. రఫాలోని టెల్‌ సుల్తాన్‌ పరిసరాల్లో శుక్రవారం రాత్రి ఆపరేషన్‌ నిర్వహించి దాదాపు 50 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన ఐడీఎఫ్‌ దళాలు.. విశ్రాంతి తీసుకోవడానికి వెళుతుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. జనవరి తర్వాత గాజా పోరులో ఇంత మంది సైనికులను ఒక దాడిలో ఇజ్రాయెల్‌ కోల్పోవడం ఇదే తొలిసారి. జనవరిలో 21 మంది సైనికులు మృతి చెందారు. తాజా దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించలేదు. 8 మంది సైనికుల్లో ఒకరి పేరు కెప్టెన్‌ వసీం మహ్మద్‌ అని ఐడీఎఫ్‌ ప్రకటించింది. మిగతా ఏడుగురిని కూడా గుర్తించామని తెలిపింది. వారి పేర్లను వెల్లడించలేదు.  

హూతీల రాడార్‌ వ్యవస్థపై అమెరికా దాడులు

దుబాయ్‌: యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల రాడార్‌ వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు ప్రారంభించింది. ఏడు రాడార్లను ధ్వంసం చేసింది. వీటి సాయంతోనే ఎర్రసముద్రంలోని వాణిజ్యనౌకలను తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. బుధవారం హూతీలు జరిపిన డ్రోన్‌ బోట్‌ దాడిలో గ్రీకుకు చెందిన వాణిజ్యనౌక ట్యూటర్‌ దెబ్బతింది. ఇందులోని 21 మంది సిబ్బందిని అమెరికా దళాలు రక్షించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని