భారత సంతతి వారితో అమెరికా ఆర్థికానికి భారీ ప్రయోజనం

అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతమే ఉన్నా.. వారివల్ల దేశార్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అధ్యయనం తేల్చింది. ‘2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది.

Published : 16 Jun 2024 05:41 IST

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతమే ఉన్నా.. వారివల్ల దేశార్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అధ్యయనం తేల్చింది. ‘2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది. జనాభాలో 1.5 శాతం ఉన్న వీరి నుంచి ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయ పన్నులో 5 నుంచి 6 శాతం లభిస్తోంది. ఇది 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల డాలర్లకు సమానం. భారతీయ అమెరికన్ల వృత్తులవల్ల అమెరికాలో కోటీ పది లక్షల నుంచి కోటీ ఇరవై లక్షల మందికి పరోక్ష ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో 16  సంస్థలకు భారత సంతతివారే ప్రధాన కార్యనిర్వహణాధికారులుగా ఉన్నారు. వారిలో సుందర్‌ పిచాయ్‌ (గూగుల్‌), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌) తదితరులున్నారు. ఈ కంపెనీలవల్ల 27 లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశానికి లక్ష కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతోంది. అమెరికాలోని 648 యూనికార్న్‌లలో 72 సంస్థల సహ వ్యవస్థాపకులు భారతీయులే. అవి 55,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అమెరికాలో 60 శాతం హోటళ్లు భారత సంతతివారు నడుపుతున్నవే. 1975లో అమెరికాలోని భారతీయులు 2 శాతం పేటెంట్లకు దరఖాస్తు చేయగా 2019 నాటికి అవి 10 శాతానికి పెరిగాయి. 2023లో భారత సంతతి శాస్త్రవేత్తలు 11 శాతం జాతీయ ఆరోగ్య సంస్థ గ్రాంట్లను పొందారు. 13 శాతం శాస్త్ర పరిశోధన పత్రాలను ప్రచురించారు. అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 22,000 మంది భారతీయ అధ్యాపకులు బోధిస్తున్నారు. వారిలో డాక్టర్‌ నీలి బెండపూడి పెన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యారు’ అని గురువారం విడుదలైన నివేదిక పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు