తుది అంకానికి హజ్‌ యాత్ర

సౌదీ అరేబియాలో తీవ్రమైన వేసవితాపం నడుమ ఆదివారం ముస్లిం యాత్రికుల హజ్‌ యాత్ర తుది అంకానికి చేరుకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈదుల్‌ అధా (బక్రీద్‌) వేడుకలు మొదలయ్యాయి.

Published : 17 Jun 2024 05:17 IST

బక్రీద్‌ వేడుకలు ప్రారంభం

మీనా: సౌదీ అరేబియాలో తీవ్రమైన వేసవితాపం నడుమ ఆదివారం ముస్లిం యాత్రికుల హజ్‌ యాత్ర తుది అంకానికి చేరుకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈదుల్‌ అధా (బక్రీద్‌) వేడుకలు మొదలయ్యాయి. వివిధ దేశాల నుంచి 18 లక్షల మందికి పైగా యాత్రికులు తరలివచ్చారు. పవిత్ర మక్కా నగరానికి వెలుపల ఉన్న అరాఫత్‌ పర్వతం నుంచి శనివారం సాయంత్రం బయలుదేరిన వీరంతా సమీపంలోని ముజ్దలిఫాలో రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం కాలినడకన మూడు స్తంభాల రమి అల్‌ జమారత్‌ వద్దకు చేరుకొని సంప్రదాయం ప్రకారం గులకరాళ్లు విసిరారు. ఆ తర్వాత మక్కాకు వచ్చి ‘తవాఫ్‌’ (ప్రదక్షిణలు) చేయడంతో హజ్‌ యాత్ర విజయవంతంగా పూర్తయింది. 

వడదెబ్బతో 14 మంది జోర్డాన్‌ యాత్రికుల మృతి

హజ్‌ యాత్రలో వడదెబ్బ సోకి 14 మంది జోర్డాన్‌ యాత్రికులు మృతిచెందినట్లు ఆ దేశానికి చెందిన పెట్రా న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఆదివారం మీనాలో 46.. మక్కాలో 47 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విపరీతమైన వేడి కారణంగా పలువురు యాత్రికులు స్పృహతప్పి పడిపోయారు. సహాయక బృందాలు వీరిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని