సంక్షిప్త వార్తలు(5)

రైల్వే మంత్రిగా అశ్వినీ వైష్ణవ్‌ 2021 జులైలో బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఇప్పటివరకూ రైళ్లు ఢీకొనడం, రైల్లో అగ్నిప్రమాదాలు, ఆర్పీఎఫ్‌ సిబ్బంది కాల్పులు సహా తరచూ భద్రతా ఉల్లంఘనల కారణంగా 329 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Published : 18 Jun 2024 04:41 IST

రైల్వేను చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వానికి పట్టదా?

రైల్వే మంత్రిగా అశ్వినీ వైష్ణవ్‌ 2021 జులైలో బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఇప్పటివరకూ రైళ్లు ఢీకొనడం, రైల్లో అగ్నిప్రమాదాలు, ఆర్పీఎఫ్‌ సిబ్బంది కాల్పులు సహా తరచూ భద్రతా ఉల్లంఘనల కారణంగా 329 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున ఏడాదికి వంద మందికి పైగా బలయ్యారు. ఇవేకాక తగిన సంఖ్యలో రైళ్లు నడపకపోవడం వల్ల రద్దీ విపరీతంగా పెరిగి ప్రయాణికులు మరుగుదొడ్లలో నిల్చొని ప్రయాణించే పరిస్థితి నిత్యకృత్యంగా మారింది. ఏసీ బోగీల్లోనూ సాధారణ తరగతి ప్రయాణికులు నిల్చొని ప్రయాణిస్తున్నారంటే రైల్వే నిర్వహణ ఎంత అధ్వానంగా మారిందో అర్థమవుతోంది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదు. అశ్వినీ వైష్ణవ్‌ను మరోసారి రైల్వే మంత్రిగా ఎంపిక చేయడమే అందుకు నిదర్శనం.

అనూష రవి సూద్, పాత్రికేయురాలు 


అఫ్గాన్‌లో బాలికల విద్యపై నిషేధానికి వెయ్యి రోజులు

అఫ్గానిస్థాన్‌లో బాలికలు మాధ్యమిక  విద్య చదవకుండా నిషేధం విధించి వెయ్యి రోజులు దాటింది. దీనివల్ల సుమారు 15 లక్షల మంది బాలికలు పాఠశాలకు దూరమయ్యారు. వారు 300 కోట్ల గంటల అభ్యసన సమయాన్ని కోల్పోయారు. బాలికలు పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం వారి హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, వారిపై మానసికంగా  తీవ్ర దుష్ప్రభావం పడేందుకు కారణమవుతుంది. బాలికలకు విద్య ఉపాధి అవకాశాల కోసం మాత్రమే కాదు, అది వారిని బాల్య వివాహాల నుంచి రక్షిస్తుంది. తాలిబన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిషేధాన్ని ఎత్తివేసే దిశగా ప్రపంచ దేశాలు చొరవచూపాల్సిన అవసరం ఉంది.

యునిసెఫ్‌


బడిలో ఇవి కూడా నేర్పించాలి 

 

పాఠశాల స్థాయి నుంచే సబ్జెక్టులతో పాటు తప్పక నేర్పించాల్సిన 10 అంశాలు: 1.స్వీయ రక్షణ 2.పబ్లిక్‌ స్పీకింగ్‌ 3.ఒత్తిడిని జయించే నైపుణ్యం 4.సామాజిక సత్ప్రవర్తన, సంబంధాలను పెంపొందించుకొనే స్వభావం 5.వంటతో పాటు ఇంటి పనులను స్వయంగా చేసుకోవడం 6.వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ 7.కోడింగ్‌ 8.పన్ను విధానాలపై అవగాహన 9.విదేశీ భాషలు 10.ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలిగే నేర్పు.

బ్రియాన్‌ ఫెరోల్డి, వ్యక్తిగత పెట్టుబడుల నిపుణులు 


జునెటీన్త్‌ వేడుకల్లో కాల్పుల కలకలం

- ఇద్దరి మృతి - టెక్సాన్‌ పార్క్‌లో ఘటన

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌ పార్క్‌లో నిర్వహించిన జునెటీన్త్‌ (జాతీయ స్వాతంత్య్ర దినోత్సవం, ఫెడరల్‌ సెలవు) వేడుకల్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. అందులో ఇద్దరు పిల్లలున్నారు. రౌండ్‌ రాక్‌లోని ఓల్డ్‌ సెటిలర్స్‌ పార్క్‌లో జునెటీన్త్‌ వేడుక సందర్భంగా శనివారం రాత్రి 11గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీస్‌ చీఫ్‌ అలెన్‌ బ్యాంక్స్‌ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా కచేరీ విషయంలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం తలెత్తగా.. గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడన్నారు. మరణించిన వారికి ఈ వాగ్వాదంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. కాల్పులు జరిపిన వారిలో ఎంత మంది పాల్గొన్నారనే దానిపై విచారణ జరుగుతుందని అలెన్‌ ఆదివారం పేర్కొన్నారు. 


నేడూ, రేపు ఉత్తర కొరియా పర్యటనలో పుతిన్‌

సియోల్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళ, బుధవారాలలో ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. పుతిన్‌ ఉత్తర కొరియా రావడం 24 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2000 సంవత్సరం జులైలో పుతిన్‌ మొదటిసారి ఉత్తర కొరియా వెళ్లి, నాటి అధ్యక్షుడైన కిమ్‌ తండ్రితో సమావేశమయ్యారు. అమెరికా నుంచి సవాళ్లు పెరుగుతున్నందున, వాటిని ఎదుర్కోవడానికి సైనిక సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియాలు భావిస్తున్నాయి. ఈ విషయమై పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు చర్చలు జరుపుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని