ముగింపు దశకు హజ్‌ యాత్ర

సౌదీలో హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. వేసవి తాపం తీవ్రంగా ఉన్నప్పటికీ.. మీనాలో సైతానును రాళ్లతో కొట్టే, మక్కాలో పవిత్ర స్థలం కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసే కార్యక్రమాల్లో ముస్లిం యాత్రికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Published : 19 Jun 2024 05:24 IST

ఈ ఏడాది సుమారు 18.3 లక్షల మంది పాల్గొన్నారన్న నిర్వాహకులు

మీనా (సౌదీ అరేబియా): సౌదీలో హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. వేసవి తాపం తీవ్రంగా ఉన్నప్పటికీ.. మీనాలో సైతానును రాళ్లతో కొట్టే, మక్కాలో పవిత్ర స్థలం కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసే కార్యక్రమాల్లో ముస్లిం యాత్రికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మక్కాకు వెలుపల మీనాలో.. సైతానుగా భావించే రాళ్ల స్తంభాలను గులకరాళ్లతో కొట్టే సంప్రదాయం మూడో రోజైన మంగళవారం కొనసాగింది. యాత్ర ముగింపు ఘట్టాల్లో ఇదొకటి. యాత్రికులు శనివారం పవిత్ర అరాఫత్‌ పర్వతం వద్ద సమావేశమై ప్రార్థనలు ముగించుకుని ఆదివారం నుంచి మీనాలో సైతానును రాళ్లతో కొట్టే మూడురోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మక్కాకు చేరి అక్కడ ప్రధాన మసీదులోని కాబా చుట్టూ ఏడుసార్లు అపసవ్య దిశలో ప్రదక్షిణలు చేసే ‘తవాఫ్‌’ సంప్రదాయాన్ని పాటిస్తారు. దీంతో యాత్ర ముగిసినట్లు. అనంతరం యాత్రికుల్లో చాలామంది మదీనా వెళ్లి మహమ్మద్‌ ప్రవక్త సమాధి వద్ద ప్రార్థనలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ పండగ చేసుకునే సమయంలోనే హజ్‌ యాత్ర ముగింపునకు వస్తుంది. తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణం మక్కాలో మంగళవారం కూడా కొనసాగింది. ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అంచనా. ఈ సారి యాత్రలో ఎండలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు, ముఖ్యంగా వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. పదుల సంఖ్యలో మరణాలూ చోటుచేసుకున్నాయి. 2024 హజ్‌ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని