Rishi Sunak: సునాక్‌ నోట ‘స్వదేశీ’ మాట.. ఎన్నికల వేళ ట్రోల్స్‌!

దేశ ప్రజలు స్థానిక ఆహార పదార్థాలనే కొనుగోలు చేయాలని బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ పిలుపునివ్వడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యింది.

Published : 19 Jun 2024 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూకేలో ఎన్నికల సమయం దగ్గరపడుతోన్న వేళ.. ప్రచారం ఊపందుకోంది. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా స్వదేశీ ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. విదేశీ కూరగాయలు, పండ్లపై ఆధారపడటాన్ని ఎలా తగ్గించుకోవాలో సూచించిన ఆయన.. స్థానిక ఉత్పత్తులకు అండగా నిలవాలన్నారు. దేశ ప్రజలు బ్రిటిష్‌ ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సునాక్‌ పిలుపునివ్వడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ మొదలయ్యాయి.

‘‘మనం విదేశీ ఆహారం మీద ఆధారపడకూడదు. బ్రిటిష్‌వి కొనండి’’ అని ఎక్స్‌ ఖాతాలో రిషి సునాక్‌ పేర్కొన్నారు. ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం అది అసాధ్యమంటూ కొట్టిపారేశారు. దేశం వ్యవసాయ సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ.. స్థానిక వస్తువులను కొనుగోలు చేయడం ఎంతో కష్టమని చెబుతున్నారు.

ఎన్నికలకు ముందే.. రిషి సునాక్‌ రాజీనామా చేయనున్నారా?

బ్రిటిష్‌ వ్యవసాయం సంక్షోభంలో ఉందని మీ ప్రభుత్వమే పేర్కొంది. దిగుమతులను అనుమతించి స్థానిక ఆహార పదార్థాలను పాడు చేశారంటూ ఓ మహిళా యూజర్‌ మండిపడ్డారు. సూపర్‌ మార్కెట్లలో ర్యాక్‌లన్నీ ఖాళీగా ఎందుకు కనిపిస్తున్నాయని.. అవసరమైన ఆహార పదార్థాలను పండించుకోలేక పోతున్నామని మరో యూజర్‌ ప్రశ్నించాడు. బ్రెగ్జిట్‌ వల్ల ఇటువంటి సమస్యలు పరిష్కారమవుతాయని అప్పట్లో చెప్పారని.. ప్రస్తుత పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ‘స్వదేశీ’ విధానాన్ని గుర్తు చేసిన కొందరు.. సునాక్‌ కూడా అదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోందని కామెంట్లు విసురుతున్నారు. జులై 4న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న వేళ సొంత పార్టీతోపాటు విపక్షం నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని