ఉక్కపోతతో హజ్‌ యాత్రికుల యాతన

సౌదీ అరేబియాలో విపరీతమైన వేడిగాలులతో ఈ ఏడాది హజ్‌ యాత్రికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వడదెబ్బ సోకి వందలమంది చనిపోగా, వారి మృతదేహాల కోసం ఆత్మీయుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నట్లు సౌదీ అధికారులు బుధవారం వెల్లడించారు.

Published : 20 Jun 2024 06:26 IST

5 రోజుల యాత్రలో 550 మంది మృతి?

గొడుగులతో హజ్‌ యాత్రికులు

మక్కా: సౌదీ అరేబియాలో విపరీతమైన వేడిగాలులతో ఈ ఏడాది హజ్‌ యాత్రికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వడదెబ్బ సోకి వందలమంది చనిపోగా, వారి మృతదేహాల కోసం ఆత్మీయుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నట్లు సౌదీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆన్‌లైనులో ప్రచారంలో ఉన్న ఒక జాబితా ప్రకారం.. అయిదు రోజుల హజ్‌ యాత్రలో కనీసం 550 మంది మృతిచెందారు. ఇద్దరు వైద్యాధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, యాత్రికుల మరణాల మొత్తం సంఖ్యపై ప్రభుత్వపరంగా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జోర్డాన్, టునీసియా వంటి కొన్ని దేశాలు తమ యాత్రికుల మరణాలను ధ్రువీకరిస్తూ ప్రకటనలు చేశాయి. మక్కా పొరుగున ఉన్న అల్‌ - ముఆయ్‌సెమ్‌లోని ఎమర్జెన్సీ కాంప్లెక్సు వద్ద వందల సంఖ్యలో యాత్రికులు బారులుతీరి తమ కుటుంబసభ్యుల వివరాల కోసం ఆరాలు తీస్తున్నారు. ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్‌ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షలమంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షలకు పైగా ఉంటారని సౌదీ హజ్‌ అధికార యంత్రాంగం తెలిపింది. బుధవారం మక్కాలోని మెడికల్‌ కాంప్లెక్సు వద్ద కొంతమంది మృతుల వివరాలు ప్రకటించారు. జాబితాలో అల్జీరియా, ఈజిప్టుతోపాటు భారత్‌కు చెందినవారి పేర్లు కూడా ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని