సంక్షిప్త వార్తలు(7)

ఇరాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మదీకి.. శిక్షా కాలం మరో ఏడాది పెరిగింది. నర్గీస్‌ చేపడుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకుగానూ ఈ అదనపు శిక్ష పడినట్టు ఆమె తరఫు న్యాయవాది బుధవారం తెలిపారు.

Updated : 20 Jun 2024 05:59 IST

నోబెల్‌ గ్రహీత నర్గీస్‌కు జైలు శిక్ష పెంపు!

దుబాయి: ఇరాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మదీకి.. శిక్షా కాలం మరో ఏడాది పెరిగింది. నర్గీస్‌ చేపడుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకుగానూ ఈ అదనపు శిక్ష పడినట్టు ఆమె తరఫు న్యాయవాది బుధవారం తెలిపారు. ఇటీవల జరగిన పార్లమెంటరీ ఎన్నికల్ని నిషేధించాలని ఓటర్లకు పిలుపునివ్వడం, ఇరాన్‌ పాలకుల అరాచకాలపై ఐరోపాలో ప్రజాప్రతినిధులకు ఉత్తరాలు రాయడం, ఇరాన్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు, రాజకీయ ఉద్యమనేతపై జరుగుతున్న హింస, లైంగిక దాడుల గురించి గొంతెత్తడం.. కారణాలుగా ఆమె న్యాయవాది పేర్కొన్నారు. 30 నెలల కారాగార శిక్ష అనుభవిస్తున్న నర్గీస్‌ ప్రస్తుతం రాజకీయ ఖైదీలు ఉండే ‘ఎవిన్‌’ జైల్లో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఆమె శిక్షా కాలాన్ని మరో 15 నెలలకు పెంచగా, ప్రస్తుతం అదనంగా ఏడాది శిక్ష పడింది. తాజా శిక్ష పెంపుపై ప్రభుత్వ వర్గాలనుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా రాలేదు. 52 ఏళ్ల నర్గీస్‌ ఇరాన్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మహిళలు హిజాబ్‌ తప్పనిసరిగా ధరించాలన్న చట్టానికి నిషేధించాలంటూ ప్రభుత్వంపైన పోరాటం చేసి జైలుకు వెళ్లారు. నర్గీస్‌ చేపడుతున్న ఉద్యమాలకుగానూ గతేడాది అక్టోబరులో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. 


చాద్‌లో మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రంలో పేలుడు

- తొమ్మిది మంది దుర్మరణం 

ఎంజమేనా: సైనిక మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రంలో పేలుడు సంభవించడంతో తొమ్మిది మంది మృతిచెందిన ఘటన పశ్చిమ ఆఫ్రికా దేశమైన చాద్‌ రాజధాని ఎంజమేనాలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 46 మందికి పైగా స్థానికులు గాయపడ్డారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో దాడి జరిగిందేమోననే భయంతో చుట్టుపక్కల నివసించే వారంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదనీ, లోతైన దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మహమద్‌ డెబీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. 


అమెరికా సైనికుడికి రష్యాలో నాలుగేళ్ల జైలు శిక్ష

మాస్కో: అమెరికాకు చెందిన ఓ సైనికుడికి రష్యాలో జైలు శిక్ష పడింది. దొంగతనానికి పాల్పడ్డాడని, హత్య చేస్తానంటూ బెదిరించాడంటూ అతనిపై అభియోగాలు మోపారు. ఈ నేరాలకు గాను వ్లాదివోస్టోక్‌ నగర న్యాయస్థానం స్టాఫ్‌ సార్జెంట్‌ గార్డన్‌ బ్లాక్‌ (34) అనే ఆ సైనికుడికి మూడేళ్ల తొమ్మిది నెలల కారాగార శిక్ష విధించింది. 115 డాలర్ల జరిమానాను వేసింది. తన స్నేహితురాలిని కలుసుకునేందుకు అతడు పసిఫిక్‌ పోర్ట్‌ సిటీకి వచ్చాడు. అయితే అతను తన వద్ద దొంగతనానికి పాల్పడ్డాడంటూ ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో గత నెలలో బ్లాక్‌ను అరెస్టు చేసి తాజాగా జైలుకు పంపారు.


పాక్‌లో సీనియర్‌ జర్నలిస్టు కాల్చివేత

పెషావర్‌: పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో మంగళవారం ఓ సీనియర్‌ జర్నలిస్టును దుండగులు కాల్చి చంపారు. ఖైబర్‌ న్యూస్‌ ఛానెల్‌లో పనిచేస్తున్న ఖలీల్‌ జిబ్రాన్‌.. ఖైబర్‌ జిల్లా లాండి కోటల్‌ పట్టణానికి చెందిన తన స్నేహితుడైన న్యాయవాదితో కలిసి తన నివాసానికి కారులో వెళ్తున్నారు. మరికాసేపట్లో ఇంటికి చేరబోతుండగా సమస్య తలెత్తి కారు ఆగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కారు వద్దకు వచ్చి, ఆయన్ని బయటకు లాగి కాల్పులు జరిపారు. జిబ్రాన్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయనతోపాటు ఉన్న న్యాయవాది తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో కూడా జిబ్రాన్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దుండగుల్ని వెంటనే అరెస్టు చేయాలని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ గండాపుర్‌ అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పాత్రికేయుల సంఘాలు విమర్శించాయి.


టీటీపీ కమాండర్లు హతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెషావర్‌ నిషిద్ధ తెహ్రీక్‌-ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) సీనియర్‌ దళపతి అబ్దుల్‌ మనన్‌ ఉరఫ్‌ హకీముల్లాను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్లు సంబంధిత అధికారులు బుధవారం వెల్లడించారు. గత ఆదివారమే మరో టీటీపీ కమాండర్‌ వలీయుల్లాను ఖైబర్‌ పఖ్తూన్‌ క్వాను రాష్ట్రంలోనే పాక్‌ భద్రతా దళాలు హతమార్చడం గమనార్హం. ఈద్‌-అల్‌-అధా పండగ సందర్భంగా పాకిస్థాన్‌తో టీటీపీ కాల్పుల విరమణ ప్రకటించినా హకీముల్లా హత్య జరిగింది. మలాకాండ్‌ వర్గ అధిపతి అజ్మతుల్లా మెహసూద్‌కు కుడిభుజం లాంటి వ్యక్తి కావడంతో అతడి మృతి టీటీపీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. 2007లో టీటీపీలో చేరిన హకీముల్లా.. పాక్‌ సరిహద్దు ప్రాంతమైన బజౌర్‌లో దాడులు, మందుపాతర పేలుళ్లు, పలు అపహరణలు చేశాడు. అల్‌ ఖైదా, అఫ్గాన్‌ తాలిబన్లకు సన్నిహితమైన టీటీపీ.. పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయంతో సహా పలు చోట్ల దాడులు జరిపింది. 2008లో ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌పై బాంబు దాడికి పాల్పడింది. 


అగ్రరాజ్యాన్ని అట్టుడికిస్తున్న ఎండలు  

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యం అమెరికాలోని ఈశాన్య, పశ్చిమ ప్రాంతాలను మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల అమెరికాలో హీట్‌ వేవ్‌లు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈ వారాంతానికి ఉష్ణోగ్రత 37.7 డిగ్రీల నుంచి 40.5 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరవచ్చని అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ వారం మొదట్లో పలు నగరాల్లో శీతల కేంద్రాలను తెరిచింది. జూల్లో జంతువుల చల్లదనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దక్షిణ న్యూ మెక్సికో రాష్ట్రంలో మంగళవారం కార్చిచ్చులు ఒకరిని బలి తీసుకోగా, 500 భవనాలకు నష్టం వాటిల్లింది. ఒక పర్వత గ్రామంలోని 7,000 మందిని అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు.  


దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రామఫోసా ప్రమాణం

జొహాన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండోసారి సిరిల్‌ రామఫోసా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రెటోరియాలోని యూనియన్‌ బిల్డింగ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి రేమండ్‌ జోండో ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రామఫోసా నేతృత్వంలోని ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ) మెజారిటీ సాధించడంలో 30 ఏళ్లలో తొలిసారి విఫలమైంది. దీంతో డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (డీఏ) సహకారంతో రామఫోసా సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఏఎన్‌సీకి 40 శాతం, డీఏకు 22 శాతం ఓట్లు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని