ఈక్వెడార్‌లో విద్యుత్తు సంక్షోభం.. ప్రజల అవస్థలు

ఒక వీధిలోనో, గ్రామంలోనో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడం చూస్తుంటాం. కానీ, దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లోని చాలా ప్రాంతాల్లో బుధవారం చీకట్లు కమ్ముకున్నాయి.

Published : 21 Jun 2024 06:11 IST

క్విటో: ఒక వీధిలోనో, గ్రామంలోనో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడం చూస్తుంటాం. కానీ, దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లోని చాలా ప్రాంతాల్లో బుధవారం చీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్తును సరఫరా చేసే ప్రధాన లైన్‌లో అంతరాయం కలగడమే అందుకు కారణం. ఈ మేరకు ఆ దేశ మంత్రి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. గ్రిడ్‌లో కనెక్షన్‌ తెగడంతో సమస్య ఏర్పడిందనీ.. కొద్ది గంటల్లోనే 95 శాతం ప్రాంతాలకు సరఫరాను పునరుద్ధరించినట్లు ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఆగిపోవడంతోపాటు రాజధాని నగరం క్విటోలో మెట్రో వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ఆసుపత్రుల్లోనూ రోగులు విలవిల్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక, రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోవడంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు. దేశ విద్యుత్తు అవసరాల్లో 75 శాతం హైడ్రోఎలక్ట్రిక్‌ ప్లాంట్లే తీరుస్తుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా విద్యుత్తు కొరతతో ఈక్వెడార్‌ తీవ్ర అవస్థలు పడుతోంది. గత ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడు ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించారు. రోజుకు ఎనిమిది గంటలపాటు కోత విధిస్తున్నారు. 2004 తర్వాత ఈ దేశంలో విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని