వడగాలులతో ఉక్కిరిబిక్కిరి.. సౌదీలో వెయ్యి దాటిన మరణాలు!

సౌదీ అరేబియాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం క్రితం అత్యధికంగా 51.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు సౌదీ వాతావరణశాఖ వెల్లడించింది.

Updated : 21 Jun 2024 06:20 IST

రియాద్‌: సౌదీ అరేబియాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం క్రితం అత్యధికంగా 51.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు సౌదీ వాతావరణశాఖ వెల్లడించింది. హజ్‌ యాత్రకు వచ్చినవారిలో వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య వెయ్యి దాటింది. ముందస్తు అనుమతి తీసుకోని యాత్రికులే వీరిలో 630 మంది ఉన్నట్లు సమాచారం. మొత్తం మృతుల్లో అత్యధికులు (658 మంది) ఈజిప్టువారు. గురువారం ఒక్కరోజే ఆ దేశానికి చెందిన 58 మంది చనిపోయారు. భారత్, పాకిస్థాన్, జోర్డాన్, ఇండోనేసియా, ఇరాన్, సెనెగల్, టునీసియాకు చెందిన వారు కూడా మృతుల్లో ఉన్నారు. రాయబార కార్యాలయాల సమాచారం మేరకు మొత్తంగా 10 దేశాలకు చెందిన 1,081 మంది యాత్రికులు ఎండదెబ్బకు మరణించినట్లు తెలిసింది. యాత్ర అనుమతి కోసం భారీగా ఖర్చు అవుతుండటంతో చాలామంది అక్రమ మార్గాల్లో మక్కాకు చేరుకుంటున్నారు. ఇలా వచ్చే వేలమందిని స్థానిక అధికారులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. రిజిస్టర్‌ చేసుకున్న వారికే యాత్ర ముగిసిన తర్వాత అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏసీ శిబిరాల్లో బస చేసేందుకు అనుమతి ఉంటుంది.

అమెరికా, మెక్సికోలలో వడగాడ్పులు

వాషింగ్టన్‌: వాతావరణ మార్పులు అమెరికా నైరుతి భాగాన్నీ, మెక్సికో, మధ్య అమెరికా దేశాలను మండిస్తున్నాయి. మెక్సికోలోని సొనోరా ఎడారిలో గతవారం ఉష్ణోగ్రత 51.9 సెల్సియస్‌ డిగ్రీలకు చేరింది. మెక్సికో చరిత్రలో ఇది రికార్డు. వడగాడ్పులతో అక్కడ ఇంతవరకు 125 మంది మరణించారు. ఉత్తర అమెరికా ఖండంలో అరుదుగా సంభవించే వడగాలులు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. ఎండలకు తాళలేక కోతులు చెట్ల మీదనుంచి రాలిపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని