రష్యా, వియత్నాం మధ్య కీలక ఒప్పందాలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వియత్నాంతో గురువారం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో విద్య, శాస్త్ర-సాంకేతికం, చమురు-గ్యాస్‌ వెలికితీత, ఆరోగ్య రంగాల్లో సహకారం ఉన్నాయి.

Published : 21 Jun 2024 06:10 IST

హనోయ్‌ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వియత్నాంతో గురువారం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో విద్య, శాస్త్ర-సాంకేతికం, చమురు-గ్యాస్‌ వెలికితీత, ఆరోగ్య రంగాల్లో సహకారం ఉన్నాయి. వియత్నాంలో అణువిజ్ఞానం, సాంకేతికత కేంద్రం ఏర్పాటు ప్రణాళికపై రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిశ్చయించాయి. వియత్నాం పర్యటనలో ఉన్న పుతిన్‌ ఆ దేశాధ్యక్షుడు టో లాంతో కలిసి ఒడంబడికలపై సంతకాలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్న రష్యా.. ఆసియా దేశాలతో తన బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్న క్రమంలో పుతిన్‌ వియత్నాంలో పర్యటించారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సైన్యాన్ని వినియోగించకుండా శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవాలనే అంశం ఆధారంగా విశ్వసనీయ భద్రత నిర్మాణం అభివృద్ధి ప్రయోజనాలపై అభిప్రాయాలను పంచుకున్నామని చర్చల అనంతరం పుతిన్‌ వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా వియత్నాంలో బలమైన రాజకీయనేత, కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి గుయెన్‌ ఫూ ట్రోంగ్‌తో పుతిన్‌ సమావేశమయ్యారు. అంతకు ముందు ఆయన అధ్యక్ష భవనంలో ఘనస్వాగతం అందుకున్నారు. 


రష్యాపై మండిపడ్డ దక్షిణ కొరియా

సియోల్‌: రష్యా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై దక్షిణ కొరియా  మండిపడింది. ఇది ఐరాస భద్రత మండలి తీర్మానాల ఉల్లంఘనేనని పేర్కొంది. యుద్ధాలు చేయడం, ఆక్రమణలకు పాల్పడటం వంటి చరిత్ర ఉన్న రెండు దేశాలు.. ఎప్పటికీ జరగని దాడుల గురించి ముందస్తుగా మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే మాస్కోపై పోరాడేందుకుగాను ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాల సరఫరాపైనా ఆలోచన చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో హెచ్చరించింది. ‘‘ప్యాంగాంగ్‌కు వ్యతిరేకంగా ఆంక్షల తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్‌ఎస్‌సీలో రష్యా ఓ శాశ్వత సభ్యదేశం. ఇప్పుడు అదే దేశానికి అండగా నిలవాలని తీసుకున్న నిర్ణయం.. మా భద్రతకు విఘాతం కలిగిస్తుంది. అదే విధంగా మాస్కోతో మా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని సియోల్‌ స్పష్టం చేసింది. 


పుతిన్‌కు పంగ్సన్‌ శునకాలను బహూకరించిన కిమ్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పంగ్సన్‌ అనే వేట శునకాలను బహూకరించారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. పుతిన్, కిమ్‌ కలిసి తెల్లటి శునకాలను చూస్తున్న వీడియోను ప్రసారం చేసింది. ఇవి ఉత్తర కొరియాలోని ఉత్తర భాగంలో మాత్రమే కనిపిస్తుంటాయి. పుతిన్‌కు శునకాలు అంటే చాలా ఇష్టం. గతంలో కొందరు దేశాధ్యక్షులు ఆయనకు అరుదైన కుక్కలను బహూకరించిన సందర్భాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని