రష్యా-ఉక్రెయిన్‌ పరస్పర దాడులు

ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులను ఉద్ధృతం చేసింది. మరోవైపు రష్యాలోని చమురు కేంద్రాలపై డ్రోన్లతో ఉక్రెయిన్‌ మరోసారి విరుచుకుపడింది.

Updated : 21 Jun 2024 06:44 IST

డ్రోన్లు, క్షిపణులతో బీభత్సం

కీవ్‌: ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులను ఉద్ధృతం చేసింది. మరోవైపు రష్యాలోని చమురు కేంద్రాలపై డ్రోన్లతో ఉక్రెయిన్‌ మరోసారి విరుచుకుపడింది. ప్రత్యర్థి పోరాట సామర్థ్యాలను దెబ్బతీసే వ్యూహంతో రెండు దేశాలూ పరస్పరం పోరాటానికి దిగాయి. రష్యా, ఉక్రెయిన్‌లు.. సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉన్న లక్ష్యాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి. మూడు నెలల నుంచి ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన మౌలిక వసతులపై రష్యా విరుచుకుపడుతోంది. తాజాగా జరిగింది ఏడో పెద్ద దాడి అని అధికారులు తెలిపారు. ప్రధానంగా మధ్య, తూర్పు ఉక్రెయిన్‌లోని ఇంధన కేంద్రాలు, కీలక మౌలిక వసతులపైకి 9 క్షిపణులు, 27 షహీద్‌ డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్లను, ఐదు క్రూజ్‌ క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు నేలకూల్చాయని ఉక్రెయిన్‌ వైమానిక దళం ప్రకటించింది. దొనెట్స్క్, నిప్రోపెట్రోవస్క్, కీవ్, విన్నిస్టియా ప్రాంతాల్లోని విద్యుత్‌ మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు కార్మికులు గాయపడ్డారని చెప్పారు. దాడుల వల్ల దేశంలో కరెంటు కోతలు పెరిగాయన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఎస్‌బీయూ దళాలు రష్యాలోని చమురు డిపోలు లక్ష్యంగా డ్రోన్‌ దాడులకు దిగాయి. దీనివల్ల అక్కడ అగ్నికీలలు చెలరేగాయి. 

పాత బాంబులకు కొత్త అవతారం 

ఉక్రెయిన్‌లోని దూర ప్రాంతాలపై దాడి చేయడానికి రష్యా.. సోవియట్‌ కాలంనాటి బాంబులను దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్‌ సాధనాలతో మెరుగుపరుస్తోంది. వాటిని గ్లైడ్‌ బాంబులుగా మారుస్తోంది. యుద్ధవిమానాల ద్వారా వాటిని జారవిడుస్తోంది. అవి గాల్లో కొంతదూరం ప్రయాణించి, నిర్దిష్ట లక్ష్యాలకు చేరుకుంటున్నాయి. సరిహద్దులకు చేరువలోని  ఉక్రెయిన్‌ నగరాల్లో ఈ పద్ధతిలో విధ్వంసం సృష్టిస్తోంది. అలాగే తన వైమానిక స్థావరాలనూ విస్తరిస్తోంది. 

ఉక్రెయిన్‌కు రుమేనియా పేట్రియాట్‌ వ్యవస్థ 

రష్యా దాడులను ఎదుర్కోవడానికి తమ పేట్రియాట్‌ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందిస్తామని ‘నాటో’ సభ్యదేశం రుమేనియా ప్రకటించింది. అన్ని అంశాలను పరిశీలించి, మిత్ర దేశాలతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా మరిన్ని చర్చలు కొనసాగించనున్నట్లు పేర్కొంది. అమెరికా ఇప్పటికే ఒక పేట్రియాట్‌ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించింది. మరొకటి సరఫరా చేసేందుకూ అంగీకరించింది. జర్మనీ కూడా ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థను అందించింది. 

ఉక్రెయిన్‌పై పోరుకు నిరసనగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) రాయబారులు అంగీకరించారు. రష్యా ఇంధన విక్రయాలను దెబ్బతీసేలా వీటిని ఖరారు చేస్తామన్నారు. ముఖ్యంగా ద్రవీకృత సహజవాయువును లక్ష్యంగా చేసుకుంటామని తెలిపారు. అలాగే కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలు రష్యాకు అందకుండా చూస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని