గాలివాటమే ఇంధనం!

పవనశక్తిని ఉపయోగించుకొని సముద్రంపై కైట్‌ సర్ఫర్లు విన్యాసాలు చేస్తుంటారు. గాల్లో ఎగిరే ఒక పవర్‌ కైట్‌.. క్రీడాకారుడిని ముందుకు లాక్కెళుతుంది. ఇదే సూత్రాన్ని నౌకాయానానికీ వర్తింపచేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ఒక సంస్థ కసరత్తు చేస్తోంది.

Updated : 23 Jun 2024 15:06 IST

నౌకల్లో పొదుపు కోసం వినూత్న ఆలోచన
సీవింగ్‌ పరిజ్ఞానంతో ఉద్గారాలకూ కళ్లెం

పవనశక్తిని ఉపయోగించుకొని సముద్రంపై కైట్‌ సర్ఫర్లు విన్యాసాలు చేస్తుంటారు. గాల్లో ఎగిరే ఒక పవర్‌ కైట్‌.. క్రీడాకారుడిని ముందుకు లాక్కెళుతుంది. ఇదే సూత్రాన్ని నౌకాయానానికీ వర్తింపచేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ఒక సంస్థ కసరత్తు చేస్తోంది. తద్వారా నౌకాయానంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి, హానికర ఉద్గారాల విడుదలకు కళ్లెం వేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.

నేడు అంతర్జాతీయ వాణిజ్యంలో నౌకాయానానిదే కీలక భూమిక. దేశాల మధ్య సరకు రవాణాలో 80 శాతానికి సముద్రమార్గమే ఆధారం. ఈ షిప్‌లు శిలాజ ఇంధనాలను వినియోగిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో నౌకాయాన పరిశ్రమ వాటా 3 శాతం. తక్షణం దీన్ని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. నౌకాయానం కోసం ప్రత్యామ్నాయ ఇంధనాలుగా గ్రీన్‌ అమోనియా వంటివి అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే అవి చాలా ఖరీదైనవి. వాటిని వినియోగంలోకి తీసుకురావాలంటే భారీ స్థాయిలో మౌలికవసతులను ఏర్పాటు చేయాలి. అందుకు దశాబ్దాలు పడుతుంది. 

ఈ నేపథ్యంలో ఎయిర్‌బస్‌ కంపెనీలో పనిచేసిన ఫ్రెంచ్‌ ఇంజినీర్లు విన్సెంట్‌ బెర్నాటెట్స్, బెనోయిట్‌ గాగ్‌నెయిర్‌ల మదిలో ఓ ఆలోచన మెరిసింది. నౌకలకు పవనశక్తిని జోడిస్తే వాటి ఇంధన వినియోగాన్ని తగ్గించొచ్చని తేల్చారు. దీనికి సంబంధించిన టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయడానికి వారు కొన్నేళ్ల కిందట ‘ఎయిర్‌సీస్‌’ అనే కంపెనీని ఏర్పాటుచేశారు. ఏళ్ల పరిశోధన అనంతరం ‘సీవింగ్‌’ అనే సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని సరకు రవాణా నౌకలపై పరీక్షిస్తున్నారు. 


ఏమిటీ టెక్నాలజీ?

వేల సంవత్సరాలుగా పడవలు.. తెరచాపను ఉపయోగించుకొని పవనశక్తితో నడిచాయి. ఎయిర్‌సీస్‌ మాత్రం అధునాతన పరిజ్ఞానాన్ని జోడించి, 21వ శతాబ్ద అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆలోచన చేసింది. ఇందుకు కైట్‌ సర్ఫింగ్‌ అనేక సాహసక్రీడ నుంచి స్ఫూర్తి పొందింది.  

  • సీవింగ్‌ పరిజ్ఞానంలో వెయ్యి చదరపు మీటర్ల పారాఫాయిల్‌ను పెద్ద గాలిపటంలా ఉపయోగించుకుంటారు. దీన్ని ట్రాక్షన్‌ వింగ్‌ అంటారు. నౌక ఒక అంచు నుంచి దీన్ని గాల్లోకి ప్రయోగిస్తారు. సముద్రతలానికి 300 మీటర్ల ఎగువన గాల్లో తేలియాడుతుంది. నౌకకు వింగ్‌కు మధ్య కేబుల్‌ ఉంటుంది. 
  • ఈ వింగ్‌.. పవనశక్తిని ఒడిసిపడుతూ నౌకను ముందుకు లాక్కెళుతుంది. అవసరం లేకపోతే దాన్ని గాల్లో నుంచి ఉపసంహరించొచ్చు.   
  • వింగ్‌ పనితీరును ఆటోపైలట్‌ సాఫ్ట్‌వేర్‌ నియంత్రిస్తుంది. 
  • ఇక్కడ ప్రత్యేకతేంటంటే.. ఈ వింగ్‌ కేవలం గాలివాటున నౌకను లాక్కెళ్లడం మాత్రమే చేయదు. అది గాల్లో ‘ఫిగర్‌ ఆఫ్‌ 8 లూప్స్‌’ అనే విధానంలో విహరిస్తుంది. తద్వారా వాయు ప్రవాహశక్తిని అనేక రెట్లు పెంచుతుంది. దీనికితోడు పవనశక్తి 50 శాతం అధికంగా ఉండే ప్రాంతం (సముద్ర ఉపరితలానికి 300 మీటర్ల ఎగువన)లో అది విహరించడం వల్ల గరిష్ఠ ప్రయోజనం ఉంటుంది. 
  • గాలిపటానికి, నౌకకు మధ్య కేబుల్‌ సంధానకర్తగా ఉంటుంది. రెండింటి మధ్య డేటా మార్పిడి జరుగుతుంది. 
  • గాలి వీచే దిశకు ఎదుబరుగా వెళ్లేటప్పుడు ఈ సీవింగ్‌ను వాడలేరు. దీనికితోడు ఇది పనిచేయడానికి కొంతైనా గాలి వీస్తూ ఉండాలి. 

డిజిటల్‌ ట్విన్‌

ఇందులో వింగ్, నౌకకు సంబంధించిన డిజిటల్‌ నమూనా రూపొందుతుంది. ఇది వింగ్‌ స్థితి, దిశ, గాలి వేగం తదితరాలను పరిగణనలోకి తీసుకొని దానికి విభిన్న గగనవిహార విన్యాసాలను సూచిస్తుంది. 300 మిల్లీ సెకన్లకోసారి అప్‌డేట్‌ అందిస్తుంది. తద్వారా ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చూస్తుంది. 


ఎకో రూటింగ్‌

ఇది సముద్ర, ఏరోనాటికల్‌ వాతావరణ డేటా ఆధారంగా.. నౌక సకాలంలో గమ్యస్థానం చేరేలా చూడటానికి అత్యంత మెరుగైన మార్గాన్ని సూచించే సాఫ్ట్‌వేర్‌. 


బోలెడు ప్రయోజనాలు

  • సీవింగ్‌ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తే సరకు రవాణా నౌకల ఇంధన వినియోగం తగ్గుతుంది. వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు సరాసరిన 20 శాతం తగ్గుతాయని ఎయిర్‌సీస్‌ సంస్థ చెబుతోంది. 
  • నౌక మోసుకెళ్లాల్సిన ఇంధన పరిమాణం కూడా తగ్గుతుంది. ఫలితంగా అది ఎక్కువ సరకును రవాణా చేయగలదు.  
  • సీవింగ్‌ను ఒక బటన్‌ నొక్కి స్వల్ప సమయంలోనే వినియోగంలోకి తీసుకురావొచ్చు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్‌ వ్యవస్థ.  

ట్రాక్షన్‌ వింగ్‌ 

వెయ్యి చదరపు మీటర్ల వింగ్‌తో వంద టన్నుల బరువును ముందుకు లాగే శక్తి వెలువడుతుందని అంచనా. 


ఫ్లైట్‌ కంట్రోల్‌ పాడ్‌

ఈ ఆటోపైలట్‌ వ్యవస్థ.. వింగ్‌కు మార్గనిర్దేశం, నియంత్రణ అందిస్తుంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు