సంక్షిప్త వార్తలు(4)

శ్రీలంక జలాల్లోకి చొరబడి అక్రమంగా చేపల వేట చేస్తున్నారన్న అభియోగంతో భారత్‌కు చెందిన 18 మంది మత్స్యకారులను అరెస్టు చేసిన అక్కడి నౌకాదళ అధికారులు మూడు ఫిషింగ్‌ బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం మీడియా కథనాలు వెల్లడించాయి.

Published : 24 Jun 2024 04:54 IST

శ్రీలంక జలాల్లో చేపల వేట..18 మంది భారత మత్స్యకారుల అరెస్ట్‌

కొలంబో: శ్రీలంక జలాల్లోకి చొరబడి అక్రమంగా చేపల వేట చేస్తున్నారన్న అభియోగంతో భారత్‌కు చెందిన 18 మంది మత్స్యకారులను అరెస్టు చేసిన అక్కడి నౌకాదళ అధికారులు మూడు ఫిషింగ్‌ బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం మీడియా కథనాలు వెల్లడించాయి. శనివారం రాత్రి గస్తీ తిరుగుతున్న సమయంలో ఉత్తర సముద్రంలోని డెల్ఫ్ట్‌ దీవుల వద్ద ఈ జాలరులు పట్టుబడినట్లు అందులో పేర్కొన్నారు. నౌకాదళ అధికార ప్రతినిధి కెప్టెన్‌ గయన్‌ విక్రమసూరియ మాట్లాడుతూ.. పట్టుబడిన జాలరులను కంకేసంతురై ఫిషింగ్‌ హార్బరుకు తరలించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత వారం కూడా నలుగురు భారత మత్స్యకారులను శ్రీలంక అధికారులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 200 మంది భారత మత్స్యకారులు శ్రీలంకలో పట్టుబడగా, 25 దాకా చేపలు పట్టే పడవలను సీజ్‌ చేశారు.


అబుధాబి హిందూ ఆలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి జైశంకర్‌

అబుధాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) విదేశాంగశాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపే నిమిత్తం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ఆదివారం అబుధాబీకి చేరుకున్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతోపాటు గాజా పరిస్థితులపై చర్చించనున్నారు. అల్‌ నహ్యాన్‌తో భేటీకి ముందు అబుధాబీలోని బాప్స్‌ (బీఏపీఎస్‌) హిందూ మందిరాన్ని జైశంకర్‌ సందర్శించారు. అక్కడున్న సాధువులతో మాట్లాడారు. అనంతరం భారత రాయబార కార్యాలయం ఏర్పాటుచేసిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాలుపంచుకొన్నారు. ‘‘అబుధాబి హిందూ ఆలయ సందర్శన సౌభాగ్యం నాకు దక్కింది. ఇరు దేశాల స్నేహానికి, నిజమైన సాంస్కృతిక వారధికి ఇది ప్రతీక. ప్రపంచానికి సానుకూల సందేశం’’ అని ఆలయ సందర్శనపై జైశంకర్‌ ‘ఎక్స్‌’ ద్వారా స్పందించారు.


అమెరికాలో పేలిన తుపాకీ.. వేర్వేరు ఘటనల్లో 29 మందికి గాయాలు 

కొలంబస్‌: అమెరికాలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 29 మంది గాయపడ్డారు. అలబామాలోని మాంట్‌గోమెరీలో ఒక పార్టీలో జరిగిన కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. ఇందులో 9 మందికి తూటాలు తగిలాయి. అనంతరం జరిగిన గందరగోళంలో మరో నలుగురు గాయపడ్డారు. నార్త్‌ పాస్‌ ప్రాంతంలో రద్దీగా ఉన్న పార్టీని లక్ష్యంగా చేసుకొని 600 రౌండ్లకుపైగా కాల్పులు జరిగినట్లు మేయర్‌ స్టీవెన్‌ ఎల్‌ రీడ్‌ తెలిపారు. ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్‌లో జరిగిన ఒక ఘటనలో 10 మందికి తూటాలు తగిలాయి. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో జరిగిన మరో కాల్పుల ఉదంతంలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానిక మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ మెమోరియల్‌ పార్క్‌లో ఆదివారం ఉదయం కొందరు గుమికూడారు. అక్కడ ఏదో అంశంపై వాగ్వాదం జరిగింది. ఇంతలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. 


రష్యాలో ప్రార్థనా స్థలాలపై దాడి.. మొత్తం ఐదుగురి మృత్యువాత 

దగెస్థాన్‌: రష్యాలోని దగెస్థాన్‌ ప్రాంతంలో ఆదివారం బీభత్సం చోటుచేసుకుంది. స్థానిక దర్బంట్‌లో యూదుల ప్రార్థనామందిరంతోపాటు దాని పక్కనే ఉన్న ఓ చర్చిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రెండింటికీ నిప్పు కూడా పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసు బలగాలు ఎదురుకాల్పులు    జరిపాయి. ఇద్దరు సాయుధ దుండగులను మట్టుబెట్టాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులతోపాటు చర్చిలో మతగురువు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని