మూర్ఛ నియంత్రణకు పుర్రెలో సరికొత్త సాధనం

తీవ్ర మూర్ఛ వ్యాధి నియంత్రణ కోసం 12 ఏళ్ల బాలుడి పుర్రెలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాత్మక సాధనాన్ని అమర్చారు. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి.

Published : 25 Jun 2024 05:29 IST

ప్రపంచంలోనే తొలిసారిగా అమర్చిన శాస్త్రవేత్తలు

లండన్‌: తీవ్ర మూర్ఛ వ్యాధి నియంత్రణ కోసం 12 ఏళ్ల బాలుడి పుర్రెలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాత్మక సాధనాన్ని అమర్చారు. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి. ఒరాన్‌ నాల్సన్‌ అనే ఈ బాలుడికి లెనాక్స్‌ గ్యాస్టట్‌ సిండ్రోమ్‌ అనే రుగ్మత ఉంది. ఇది చికిత్సకు లొంగని ఒకరకం మూర్ఛ వ్యాధి. మూడేళ్ల వయసు నుంచి అతడు ఈ రుగ్మతతో బాధపడుతున్నాడు. నాటి నుంచి అతడు ఒక రోజులో పదుల సంఖ్యలో మూర్ఛ బారినపడేవాడు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు గత ఏడాది అక్టోబరులో ఈ బాలుడి పుర్రెలో న్యూరోస్టిమ్యులేటర్‌ అమర్చారు. ఈ శస్త్రచికిత్సకు 8 గంటల సమయం పట్టింది. ఈ సాధనం వల్ల ఒరాన్‌.. ఒకరోజులో మూర్ఛ బారినపడటం 80 శాతం తగ్గింది. 

మెదడులో విద్యుత్‌ చర్యలు అసాధారణ స్థాయిలో పెరగడం వల్ల మూర్ఛ వ్యాధి తలెత్తుతుంది. ఒరాన్‌ తలలో అమర్చిన న్యూరోస్టిమ్యులేటర్‌.. ఒక స్థిర స్థాయిలో విద్యుత్‌ ప్రకంపనలను వెలువరిస్తుంది. వాటిని మెదడు అంతర్భాగంలోకి పంపుతుంది. మూర్ఛ వ్యాధి బాధితుల్లో వెలువడే అసాధారణ సంకేతాలను అది విచ్ఛిన్నం చేస్తుంది. ఈ సాధనం వల్ల ఒరాన్‌ జీవన నాణ్యత మెరుగుపడిందని అతడి తల్లి జస్టిన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని