చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను.

Published : 04 Jul 2024 04:06 IST

విదేశీ పర్యటనలతో అలసిపోయాను
ట్రంప్‌తో సంవాదంపై బైడెన్‌ వ్యాఖ్యలు
సీఎన్‌ఎన్‌ పోల్‌లో కమలా హారిస్‌కు ఓటర్ల మద్దతు

వాషింగ్టన్‌: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను. ఆ ప్రభావం నాపై పడింది. అలసిపోయాను. చర్చ సమయంలో వేదికపైనే దాదాపు నిద్రపోయాను. నా ప్రదర్శనపై నెపాలు వెతకాలనుకోవడంలేదు. సంజాయిషీ మాత్రమే ఇస్తున్నాను’ అని తెలిపారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్, బైడెన్‌ గతవారం అట్లాంటాలో తొలి ముఖాముఖి చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సంవాదంలో బైడెన్‌ చాలా సందర్భాల్లో తడబడ్డారు. దీంతో ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వంపై డెమోక్రట్లలో అంతర్మథనం మొదలైంది. బైడెన్‌ను మారుస్తారన్న కథనాలూ వస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థిపై సీఎన్‌ఎన్‌ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న భారతీయ అమెరికన్‌ కమలా హారిస్‌వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. 81 ఏళ్ల బైడెన్‌తో పోలిస్తే ట్రంప్‌ను ఢీకొట్టే సత్తా 59 ఏళ్ల హారిస్‌కు మెరుగ్గా ఉందని ఈ పోల్‌ ద్వారా తేలింది. దీని ప్రకారం.. బైడెన్‌ కంటే ట్రంప్‌ 6 పాయింట్లు ముందున్నారు. ఓటర్లలో ట్రంప్‌నకు 47 శాతం మంది అనుకూలంగా ఉంటే హారిస్‌కు 45 శాతం మంది మద్దతు పలికారు. డెమోక్రటిక్‌ జాతీయ కమిటీ ప్రచార కార్యక్రమంలో బుధవారం బైడెన్, కమలా హారిస్‌ సంయుక్తంగా పాల్గొని తాము మరోసారి ఎన్నికయ్యేందుకు పోరాడుతున్నామని చెప్పారు. తాను డెమోక్రటిక్‌ పార్టీకి నేతనని, రేసు నుంచి వైదొలగాల్సిందిగా తనను ఎవరూ బలవంతం చేయలేరని బైడెన్‌ స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని