ఆ దేశాలను ఉపేక్షించొద్దు

ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్‌ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది.

Published : 05 Jul 2024 04:51 IST

ఎస్‌సీవో సదస్సులో భారత్‌ పిలుపు 

ఆస్తానా: ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్‌ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. పరోక్షంగా పాకిస్థాన్, చైనాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసింది. కజఖ్‌స్థాన్‌ రాజధాని ఆస్తానా వేదికగా గురువారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 24వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ సందేశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ చదివి వినిపించారు. ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే.. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి పెద్ద ముప్పుగా మారుతుందని అందులో హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు క్రియాశీల చర్యలు అవసరమని సూచించారు. అనుసంధానత, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను అన్ని దేశాలూ గౌరవించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. చైనాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు దాదాపుగా స్పష్టమవుతోంది. మరోవైపు- పర్యావరణంలో ప్రతికూల మార్పులు ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళనకరంగా మారాయని జైశంకర్‌ పేర్కొన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అందుకునేందుకు భారత్‌ కృషిచేస్తోందని, పర్యావరణ హిత మౌలిక వసతులను వేగంగా సమకూర్చుకుంటోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెంపు, ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం వంటి చర్యలను అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. తాజా సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తదితర నేతలు పాల్గొన్నారు. బెలారస్‌ గురువారం ఎస్‌సీవోలో చేరింది. 


  • పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సదస్సులో ప్రసంగిస్తూ.. ఎస్‌సీవో సభ్యదేశాలకు ఉగ్రవాదం అతిపెద్ద ఆందోళనకర అంశంగా మారిందన్నారు. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ సర్కారుతో అన్ని దేశాలూ అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. 
  • సభ్యదేశాల భద్రతపై ఎస్‌సీవో దృష్టిసారిస్తుందని పుతిన్‌ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. వేర్పాటువాదం, తీవ్రవాదంపై పోరు కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. 
  • ఎస్‌సీవో మండలి విస్తరిత ఫార్మాట్‌ సమావేశంలోనూ ప్రధాని మోదీ సందేశాన్ని జైశంకర్‌ చదివి వినిపించారు. ఇరాన్‌లోని చాబహర్‌ ఓడరేవు అబివృద్ధిలో భారత్‌ సాధించిన పురోగతి భూ పరివేష్ఠిత మధ్య ఆసియా దేశాలకు చాలా విలువైనదిగా మారడమే కాకుండా, భారత్‌-యూరేసియా మధ్య వాణిజ్యానికి సమస్యలు తలెత్తకుండా చూస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధి ఇంజిన్లలో ఒకటిగా ‘మేకిన్‌ ఇండియా’ మారగలదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అది ఊతమివ్వగలదని వ్యాఖ్యానించారు. 
  • ఎస్‌సీవో ప్రభుత్వాధినేతల తదుపరి సమావేశానికి పాకిస్థాన్‌ వచ్చే ఏడాది అక్టోబరులో ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ సమావేశానికి భారత ప్రధానిని కూడా ఆహ్వానిస్తామని పాక్‌ స్పష్టం చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని