బ్రిటన్‌ ఎన్నికల్లో భారత సంతతి హవా

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

Published : 06 Jul 2024 04:11 IST

రికార్డు స్థాయిలో 28 మంది గెలుపు
సాంస్కృతిక శాఖ మంత్రిగా లీసా నాండీ

లండన్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వారిలో లీసా నాండీ(44) బ్రిటన్‌ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తెలుగు సంతతికి చెందిన చంద్ర కన్నెగంటి, ఉదయ్‌ నాగరాజు మాత్రం ఓటమి పాలయ్యారు. 

 ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి అభ్యర్థుల్లో రిషి సునాక్‌ ముందున్నారు. రిచ్‌మండ్‌ అండ్‌ నార్తర్న్‌ అలర్టన్‌ స్థానం నుంచి ఆయన మరోసారి గెలుపొందారు. మాజీ హోంమంత్రులు సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్‌ తమ స్థానాలను పదిలంగా ఉంచుకోగలిగారు. భారత సంతతికి చెందిన క్లెయిర్‌ కౌటిన్హో కూడా విజయం సాధించారు. సౌత్‌వెస్ట్‌ హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ నుంచి కన్సర్వేటివ్‌ నేత గగన్‌ మొహీంద్ర, లీసెస్టర్‌ ఈస్ట్‌ నుంచి శివాని రాజా గెలుపొందారు. లేబర్‌ పార్టీకి చెందిన రాజేశ్‌ అగర్వాల్‌పై శివాని విజయం సాధించారు. కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన శైలేశ్‌ వారా, తొలిసారి పోటీలో దిగిన అమీత్‌ జోగియాలు స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

లేబర్‌ పార్టీ నుంచే అత్యధికులు 

లేబర్‌ పార్టీ నుంచే భారత సంతతి అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. వీరిలో సీమా మల్హోత్రా (వాల్‌సాల్‌ నియోజకవర్గం), వాలెరీ వాజ్‌ (బ్లోక్స్‌విచ్‌).. ఆమె సోదరి కీత్‌ వాజ్, లీసా నాండీ (విగాన్‌)లు భారీ మెజార్టీతో గెలుపొందారు. బ్రిటిష్‌ సిక్కు ఎంపీలు ప్రీత్‌ కౌర్‌ గిల్, తన్‌మంజిత్‌ సింగ్‌ ధేహిలు మరోసారి విజయం సాధించారు. నావెందు మిశ్ర, రదిమా విటోమ్‌లు లేబర్‌ పార్టీ నుంచి భారీ మెజార్టీతో తమ స్థానాలను పదిలపరచుకున్నారు.

తొలిసారి అడుగుపెడుతున్నారు

లేబర్‌ పార్టీకి చెందిన జాస్‌ అథ్వాల్, బాగీ శంకర్, సత్వీర్‌ కౌర్, హర్‌ప్రీత్‌ ఉప్పల్, వారిందర్‌ జస్, గురిందర్‌ జోసన్, కనిష్క నారాయణ్, సోనియా కుమార్, సురీనా బ్రాకెన్‌ బ్రిడ్జ్, కిరిత్‌ ఎంట్‌విజిల్, జీవన్‌ సంధేర్, సోజాన్‌ జోసెఫ్‌లు తొలిసారిగా బ్రిటన్‌ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వీరితోపాటు లిబరల్‌ డెమోక్రాట్‌ తరఫున మునిరా విల్సన్‌ మరోసారి విజయం సాధించారు.

భారత పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రి డేవిడ్‌ లామీ?

బ్రిటన్‌ నూతన ప్రధాని కీర్‌ స్టార్మర్‌ లేబర్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు శుక్రవారమే కసరత్తు మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో దేశ విదేశీ వ్యవహారాల మంత్రిగా పార్టీ నాయకుడు, న్యాయవాదైన డేవిడ్‌ లామీ (51)ని ఎంపిక చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు ఆయన గట్టి మద్దతుదారు కావడం గమనార్హం. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జయశంకర్‌ను ఆయన ఇటీవలే తన స్నేహితుడుగా పేర్కొనడం విశేషం. అంతేకాకుండా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల్లోనే తాను భారత్‌లో పర్యటిస్తానని కూడా పేర్కొనడం ఆసక్తికరం. ఈ నేపథ్యంలో ఆయన తొందరలోనే భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


సునాక్‌పై ప్రశంసలు

10 డౌనింగ్‌ స్ట్రీట్ నివాసం నుంచి బయటకు వస్తున్న రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత

ఫలితాల అనంతరం బ్రిటన్‌ తాజా మాజీ ప్రధాని రిషి సునాక్‌పై ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ప్రశంసలు కురిపించారు. ‘‘మన దేశం(యూకే) మొదటి బ్రిటిష్‌ ఆసియా ప్రధానిగా ఆయన(రిషి సునాక్‌) సాధించిన ఘనత, ఆయన చేసిన అదనపు కృషిని ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదు. దానికి ఈరోజు మేము అభినందిస్తున్నాం. ఆయన అంకితభావాన్ని, కృషిని గుర్తించాం’’ అని అభినందించారు స్టార్మర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని