బ్రిటన్‌ నూతన ఆశాకిరణం

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కీర్‌ స్టార్మర్‌ (61) పేరు ఇంటా బయట మారుమోగిపోతోంది.

Published : 06 Jul 2024 04:12 IST

లేబర్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన నాలుగేళ్లకే స్టార్మర్‌కు ప్రధాని పీఠం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కీర్‌ స్టార్మర్‌ (61) పేరు ఇంటా బయట మారుమోగిపోతోంది. 14 ఏళ్ల సుదీర్ఘ కాలం అనంతరం పార్టీని అఖండ విజయ విజయతీరాలకు చేర్చిన స్టార్మర్‌ దేశ ప్రజల నూతన ఆశాకిరణంగా మారారు. మందగించిన ఆర్థిక వ్యవస్థ, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న నిరుద్యోగం, జీవన ప్రమాణాలు దిగజారుతున్న వేళ పౌరులకు ఆపద్బాంధవుడిగా కనిపించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొమ్మిదేళ్లకే, పార్టీ పగ్గాలు చేపట్టిన నాలుగేళ్లకే ప్రధానిగా అవతరించిన ఆయన ప్రస్థానం ఆసక్తికరం. 

50 ఏళ్లలో ఆయనే అధిక వయస్కుడు

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం స్టార్మర్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో తొలిసారి ఉత్తర లండన్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే లేబర్‌ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌ చరిత్రలో గత ఐదు దశాబ్దాల్లో ఇంత ఎక్కువ వయసున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే తొలిసారి. 

మానవహక్కుల సలహాదారుగా..

1962 సెప్టెంబరు 2న జన్మించిన స్టార్మర్‌ బాల్యమంతా లండన్‌ శివారుల్లోనే గడిచింది. ఆయన తండ్రి టూల్‌ మేకర్, తల్లి ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసేవారు. ఆమె అరుదైన వ్యాధితో బాధపడేవారు. కుటుంబంలో తొలిసారి యూనివర్సిటీకి వెళ్లింది స్టార్మరే. న్యాయవిద్యను అభ్యసించిన ఆయన చదువు పూర్తయిన తర్వాత 2003లో నార్తన్‌ ఐర్లాండ్‌ పోలీసులకు మానవహక్కుల సలహాదారుగా వ్యవహరించారు.

జర్నలిస్టులకు శిక్షలు వేయించి వార్తల్లోకి..

  ఐదేళ్ల తర్వాత లేబర్‌ పార్టీ నాయకుడు, ప్రధాని గార్డెన్‌ బ్రౌన్‌ హయాంలో ఇంగ్లాండ్, వేల్స్‌కు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఖర్చులను దుర్వినియోగం చేసే ఎంపీలు, ఫోన్‌ హ్యాకింగ్‌కు పాల్పడిన జర్నలిస్టులకు శిక్షలు వేయించి వార్తల్లో నిలిచారు. న్యాయవృత్తిలో ఆయన చేసిన సేవలకు గానూ 2014లో రాణి ఎలిజెబెత్‌ 2 నుంచి నైట్‌హుడ్‌ అందుకున్నారు. 2015లో ఆయన ఎంపీగా గెలవడానికి కొద్ది నెలల ముందే తల్లి దూరమైంది. ఆ బాధను బిగపట్టి ప్రచారంలో పాల్గొన్నారు. స్టార్మర్‌కు భార్య విక్టోరియా ఇద్దరు పిల్లలున్నారు.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామంటూ..

లేబర్‌ పార్టీ అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని అధికార కన్సర్వేటివ్‌ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. దాన్ని స్టార్మర్‌ గట్టిగా తిప్పికొట్టారు. యూకేలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామనే హామీతో ముందుకెళ్లారు. కన్సర్వేటివ్‌ పార్టీలో ఉన్న అస్థిరతను ఎత్తిచూపారు. ఇవన్నీ లేబర్‌ పార్టీ విజయానికి కలిసొచ్చాయి. 

భారత్‌తో సంబంధాలపై సానుకూల వైఖరి

ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే భారత్‌తో సంబంధాలపై స్టార్మర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే లేబర్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కూడా.. భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు దేశ భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పు వంటి రంగాల్లో మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించడం వల్ల భారత్‌- యూకే మధ్య మంచి బంధం ఏర్పడనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని