విలయంలోనూ వీడని పుష్ప విలాసం!

ముగింపు కానరాని యుద్ధంలో... అంతులేని ఆవేదనలో... ఇళ్లు కూలుతున్నా.... తోటివారు రాలుతున్నా... తమ వంతెప్పుడో తెలియకున్నా... నష్టాలు... కష్టాలు గుట్టలుగా పేరుకుంటున్నా... మరిగిన జీవితాల్లో కన్నీరు ఇగిరిపోయినా...

Updated : 06 Jul 2024 04:46 IST

ముగింపు కానరాని యుద్ధంలో...
అంతులేని ఆవేదనలో...
ఇళ్లు కూలుతున్నా....
తోటివారు రాలుతున్నా...
తమ వంతెప్పుడో తెలియకున్నా...
నష్టాలు... కష్టాలు గుట్టలుగా పేరుకుంటున్నా...
మరిగిన జీవితాల్లో కన్నీరు ఇగిరిపోయినా...
కారణం లేని మరణం... 
ఏ దిశనుంచో ఎక్కుపెట్టి ఉన్నా...
ఉక్రెయిన్‌ వాసులు...
ఆకుల్లో ఆకులై... పువ్వుల్లో పువ్వులై...
ప్రకృతి ఒడిలోకి వాలిపోతున్నారు. మల్లియలారా... మాలికలారా అంటూ మకరందాలై... 
మందారాల్లో జీవన మాధుర్యాన్ని వెదుక్కుంటున్నారు!
మరణభయాన్ని మరచిపోతున్నారు!

రష్యాతో సాగుతున్న యుద్ధం తమ జీవితాలను అతలాకుతలం చేసినా ప్రకృతితో మమేకమై... జీవితంలో గుచ్చుకున్న ముళ్లను గులాబీల్లా భరిస్తున్నారు! ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అడుగడుగునా కనిపించే ఈ దృశ్యాలే... యుద్ధంలోనూ ప్రకృతి పట్ల... పువ్వుల పట్ల వారికున్న శ్రద్ధకు నిదర్శనాలు! కీవ్‌తో పాటు ఉక్రెయిన్‌లోని ఏ పట్టణాన్ని చూసినా వేలకొలది పుష్పగుచ్ఛాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో నిరాశకు తావులేకుండా... సుమాల పరిభాషలో ప్రజలు ఇలా నిశ్చలతను చాటుతున్నారు!

అందుకే... 

వారొక.. పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్లు విప్పి ‘మా ప్రాణము తీతువా... యనుచు బావురుమనటం లేదు... పుష్పవిలాపం చేయట్లేదు! 

సరికదా...

నేల జారిన పూవులు కూడా పరిమళాలు వెదజల్లుతూ... గాయపడ్డ మనసులకు మలాములద్దుతున్నాయి. ధైర్యాన్నిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని