ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు.

Published : 07 Jul 2024 06:33 IST

బైడెన్‌ పునరుద్ఘాటన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. శుక్రవారం ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతి ఉద్ఘాటించారు. అట్లాంటాలో వారం రోజుల క్రితం తన రిపబ్లికన్‌ ప్రత్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌తో చర్చలో తాను అస్వస్థత కారణంగానే తడబడ్డానని ఆయన వివరించారు. ఈ చర్చ తరవాత తనను పోటీ నుంచి తప్పుకోవలసిందిగా డెమోక్రటిక్‌ పార్టీ వారెవరూ అడగలేదనీ, అలా దేవుడు చెబితేనే తప్పుకొంటానన్నారు. తాను ప్రపంచాన్నే నడిపిస్తున్నాననీ, అమెరికా అధ్యక్ష పదవికి తనకన్నా అర్హుడు మరొకరు లేరన్నారు. తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అబద్దాలకోరు అనీ, 2020లో ఆయన్ను ఓడించాననీ, 2024లో కూడా తిరిగి ఓడించబోతున్నానని ఉద్ఘాటించారు. మూడున్నరేళ్ల పాలనలో తాను ఎన్నో విజయాలు సాధించాననీ, అవి ట్రంప్‌తో గంటన్నర పాటు జరిపిన చర్చ వల్ల వమ్ము కావన్నారు. కొవిడ్‌ నుంచి అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోనే అత్యంత బలీయ ఆర్థిక వ్యవస్థగా నిలిపానని బైడెన్‌ తెలిపారు. తన ముదిమి వయసు గురించి చాలా చర్చ జరుగుతోందనీ, కోటిన్నర కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి తన వయసు అడ్డురాలేదని పేర్కొన్నారు. 


నోరు పారేసుకుంటున్న ట్రంప్‌

ట్రంప్‌తో చర్చ అనంతరం బైడెన్‌ పని అయిపోయిందంటూ రిపబ్లికన్లు దూకుడు పెంచారు. వారు మొదటి నుంచీ బైడెన్‌కు ఓటు వేయడమంటే కమలా హ్యారిస్‌కు ఓటు వేయడమేనని ప్రచారం చేస్తూవచ్చారు. బైడెన్‌ అనారోగ్యాన్ని కమలా హ్యారిస్‌ కప్పిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ట్రంప్‌ తాజాగా విడుదల చేసిన వీడియోలో బైడెన్‌ను ‘కుప్పకూలిన చెత్త కుప్ప’గా వర్ణించారు. ఆయన్ను ఎన్నికల బరి నుంచి తరిమేశానని చెప్పుకున్నారు. బైడెన్‌కు బదులుగా కమలా హ్యారిస్‌ రంగంలోకి దూకుతారనీ, ఆమె మరీ హీనమనీ, జాలిపడాల్సిన పరిస్థితి ఉందని నోరు పారేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని