సంక్షిప్త వార్తలు

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 07 Jul 2024 04:20 IST

పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చు
ఇజ్రాయెల్‌-లెబనాన్‌ ఉద్రిక్తతలపై ఐరాస

ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐరాస శాంతిపరిరక్షక దళాలను కీలక ప్రదేశాలకు తరలించినట్లు తెలిపారు. ఈ దళంలో భారత్‌కు చెందిన 901 మంది సైనికులు ఉన్నారు. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు వర్గాలు అడుగులు వేయాలని, లేదంటే భారీగా ప్రాణనష్టం సంభవించే అవకాశముందని ఐరాస హెచ్చరించింది.


ద్వైపాక్షిక సంబంధాల్లో మోదీ పర్యటన కీలకం: రష్యా 

మాస్కో: భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో నిర్వహించబోయే పూర్తిస్థాయి పర్యటన చాలా ముఖ్యమైనదని రష్యా పేర్కొంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు 22వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ రష్యాకు వస్తున్న విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో రెండు దేశాల సంబంధాలను ఇద్దరు నేతలూ సమీక్షిస్తారు. పరస్పర ఆసక్తి ఉన్న సమకాలీన ప్రాంతీయ వ్యవహారాలు, ప్రాపంచిక విషయాలను చర్చిస్తారు. చర్చల కోసం విస్తృతమైన అంశాలు ఉన్నాయని, ఇద్దరు నేతలు ఇష్టాగోష్ఠిగానూ చర్చించుకుంటారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రి పెస్కోవ్‌ శనివారం తెలిపారు. రెండు దేశాల చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయిలో జరుగుతాయన్నారు. 2019 తర్వాత మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని