సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్‌ నూతన ప్రధాని కీర్‌ స్టార్మర్‌ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు.

Updated : 07 Jul 2024 04:38 IST

మోదీ, స్టార్మర్‌ పరస్పర అంగీకారం 
బ్రిటన్‌ నూతన ప్రధానికి భారత ప్రధాని ఫోన్‌ 

లండన్, దిల్లీ: భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్‌ నూతన ప్రధాని కీర్‌ స్టార్మర్‌ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. స్టార్మర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి నూతనంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీఏ, రక్షణ-భద్రత, అధునాతన సాంకేతికతలు, వాతావరణ మార్పులు సహా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాణిజ్య ఒప్పందాన్ని విస్తృతపరిచి మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరుదేశాలూ తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయి. ఈ ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారనీ, వీలైనంత త్వరలో సమావేశం కావాలని వారు భావిస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో భారత సమాజం పురోగమన పాత్రను స్టార్మర్‌ కొనియాడారు. ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించాలని నేతలిద్దరూ నిర్ణయించారు. త్వరలో భారత్‌ను సందర్శించాల్సిందిగా కీర్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా నేతలిద్దరూ గుర్తుచేసుకున్నారు. రెండు దేశాల్లో సాధారణ ఎన్నికల వల్ల ఎఫ్‌టీఏపై చర్చలు 14వ విడతలో ఆగిపోయాయి.


తొలి క్యాబినెట్‌ సమావేశానికి హాజరై 10 డౌనింగ్‌ స్ట్రీట్ నుంచి వెలుపలకు వస్తున్న క్రీడలు, మీడియా, సాంస్కృతిక శాఖ మంత్రి లీసా నంది. ఆమె భారత సంతతికి చెందినవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు