ఇరాన్‌లో సంస్కరణలవాది గెలుపు

ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్‌ పెజెష్కియాన్‌ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్‌లో ఇస్లామిస్టు సయీద్‌ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు.

Updated : 07 Jul 2024 04:37 IST

మసౌద్‌ పెజెష్కియాన్‌కు పట్టం కట్టిన జనం
ఇస్లామిస్టు జలీలీ ఓటమి

దుబాయ్‌: ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్‌ పెజెష్కియాన్‌ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్‌లో ఇస్లామిస్టు సయీద్‌ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. మొత్తం 3 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెజెష్కియాన్‌కు 1.63 కోట్ల ఓట్లు వచ్చాయి. జలీలీకి   1.35 కోట్ల ఓట్లు లభించాయి. జూన్‌ 28వ తేదీన జరిగిన తొలి విడత పోలింగ్‌లో ఇరాన్‌ చరిత్రలోనే 1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత అతి తక్కువ ఓటింగ్‌ శాతం నమోదైంది. 

  • శుక్రవారం జరిగిన మలి విడతలో 49.6శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదీ తక్కువే.

హిజాబ్‌పై సడలింపు హామీతో..

పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంతోపాటు ఎంతో కాలంగా అమల్లో ఉన్న తప్పనిసరి హిజాబ్‌ నిబంధనను సడలిస్తానని హామీ ఇవ్వడంతో పెజెష్కియాన్‌ విజయం సాధించినట్లు అర్థమవుతోంది.   

హృద్రోగ శస్త్రచికిత్స నిపుణుడు

హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణుడైన పెజెష్కియాన్‌.. సుదీర్ఘకాలంగా చట్టసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన అజేరీ, ఫార్సీ, కుర్దిష్‌ భాషలను మాట్లాడగలరు. గత కొన్ని దశాబ్దాల్లో పశ్చిమ ఇరాన్‌ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నేతగా ఆయన నిలిచారు. 

ఖమేనీ అభినందనలు

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పెజెష్కియాన్‌ను సుప్రీం లీడర్‌ ఖమేనీ అభినందించారు. ‘ఎన్నికైన అధ్యక్షుడు దేవుడి విశ్వాసాన్ని పొందుతారని భావిస్తున్నా. తన విజన్‌తో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

  • పెజెష్కియాన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అభినందించారు. 

ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మసౌద్‌ పెజెష్కియాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మన బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా మీతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నాం’ అని ఎక్స్‌ వేదికగా మోదీ స్పందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు