యుద్ధానికి 9 నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు

కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి, హమాస్‌ చెరలోని బందీలను విడిపించాలంటూ ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా నిరసనకారులు కదం తొక్కారు.

Published : 08 Jul 2024 04:05 IST

బందీల విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండు
మంత్రులు, పార్లమెంటు సభ్యుల ఇళ్ల ముందు ప్రదర్శనలు

టెల్‌ అవీవ్‌: కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి, హమాస్‌ చెరలోని బందీలను విడిపించాలంటూ ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా నిరసనకారులు కదం తొక్కారు. గాజా యుద్ధానికి, హమాస్‌ మారణహోమానికి తొమ్మిది నెలలైన సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించారు. మంత్రులు, పార్లమెంటు సభ్యుల ఇళ్లముందు ప్రదర్శనలు నిర్వహించారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని, ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పదవి నుంచి దిగిపోవాలని, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత 120 మంది ఇజ్రాయెలీలు హమాస్‌ చెరలో ఉన్నారు. వీరిలో 40 మంది చనిపోయి ఉండొచ్చని టెల్‌అవీవ్‌ భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా మద్దతిస్తున్న మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయి. గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెప్పిన హమాస్‌.. తాజాగా ఆ కీలక డిమాండ్‌పై వెనక్కి తగ్గింది. దీంతో త్వరలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. మరోవైపు దక్షిణ గాజాలోని కరెమ్‌ షాలోమ్‌ క్రాసింగ్‌ దగ్గర చేతికి సంకెళ్లతో ఉన్న మూడు మృత దేహాలు లభ్యమైనట్లు నాసిర్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వారంతా ఆ క్రాసింగ్‌ ద్వారా గాజాలోకి వస్తున్న మానవతాసాయం సురక్షితంగా గమ్యస్థానం చేరడానికి పనిచేస్తున్న సిబ్బందని పాలస్తీనా వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని