ఏడాది తర్వాత ‘అంగారక ఆవాసం’ నుంచి వెలుపలికి..!

అంగారక గ్రహంపైకి మానవసహిత యాత్ర చేపట్టడానికి సన్నాహకంగా నిర్వహించిన ఒక ప్రయోగం ముగిసింది.

Published : 09 Jul 2024 03:54 IST

వాషింగ్టన్‌: అంగారక గ్రహంపైకి మానవసహిత యాత్ర చేపట్టడానికి సన్నాహకంగా నిర్వహించిన ఒక ప్రయోగం ముగిసింది. ఇందులో భాగంగా ఏడాదిపాటు ఒక కృత్రిమ ఆవాసంలో ఉన్న సిబ్బంది.. తాజాగా వెలుపలికి వచ్చారు. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రంలో ఇది జరిగింది. 

ఈ ప్రయోగంలో నలుగురు వాలంటీర్లు 12 నెలల పాటు.. అంగారక వాతావరణాన్ని పోలి ఉండే ఒక ఆవాసంలో  గడిపారు. త్రీడీ ముద్రణ ద్వారా రూపొందిన ఈ శిబిరం విస్తీర్ణం 1700 చదరపు అడుగులు. గత ఏడాది జూన్‌ 25న వాలంటీర్లు ఇందులోకి ప్రవేశించారు. వీరిలో కెల్లీ హ్యాస్టన్‌ మిషన్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అందులో అంగారక గ్రహంపై ఉన్న పరిస్థితులను కృత్రిమంగా ఏర్పరిచారు. ‘క్రూ హెల్త్‌ అండ్‌ పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఎనలాగ్‌’ (సీహెచ్‌ఏపీఈఏ) పేరిట ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. పరీక్షార్థులు.. ఇందులో సిమ్యులేటెడ్‌ స్పేస్‌వాక్‌లు (మార్స్‌వాక్‌లు) నిర్వహించారు. తమ ఆహారం కోసం కూరగాయలను పండించారు. పరిమిత వనరులతో అంగారక గ్రహంపై ఉన్నప్పుడు వ్యోమగాములకు ఎదురయ్యే అవకాశం ఉన్న సవాళ్లపై వీరు కసరత్తు చేశారు. ఇందులో ఒంటరితనం, భూమిపై ఉన్న మిషన్‌ కంట్రోల్‌ కేంద్రంతో జరిపే కమ్యూనికేషన్లలో 22 నిమిషాల జాప్యం వంటివి ఉన్నాయి. పుడమికి, అంగారక గ్రహానికి మధ్య ఉన్న దూరం వల్ల ఈ ఆలస్యం జరుగుతుంది. పోషకాహారం, దానివల్ల వ్యోమగాములపై పడే ప్రభావం వంటి అంశాలపైనా దృష్టిసారించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని