ట్రంప్‌ను ఓడించాలంటే నేనే ఉత్తమం

డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానేనని జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత నాటకాలు, వదంతులను ఇక కట్టిపెట్టాలన్నారు.

Published : 09 Jul 2024 04:06 IST

నాటకాలాపండి.. ముమ్మాటికీ నేనే అభ్యర్థిని 
డెమోక్రాట్లకు బైడెన్‌ లేఖ

వాషింగ్టన్‌: డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానేనని జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత నాటకాలు, వదంతులను ఇక కట్టిపెట్టాలన్నారు. బరి నుంచి తాను వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్న దాతలు, కొందరు డెమోక్రాట్‌ సభ్యులకు ఆయన సోమవారం ఈ మేరకు రెండు పేజీల లేఖ రాశారు. తన విషయంలో వీరు వ్యక్తపరుస్తున్న ఆందోళనలు ఏమిటనేది తెలుసుకున్నానని, వాటినేమీ గాలికి వదిలేయలేదని స్పష్టంచేశారు. ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించేందుకు తానే ఉత్తమం అనే గట్టి నమ్మకంతో ఉన్నానని, అలాంటి విశ్వాసం లేకపోతే ఎన్నికల గోదాలోకే దూకేవాడిని కానని చెప్పారు. బరిలో తాను ఉన్నానని, వెనుదిరిగిపోయేదే లేదని తేల్చిచెప్పారు.

మూడున్నరేళ్ల పనితీరును 90 నిమిషాల చర్చతో తీసేయలేరు

మూడున్నరేళ్లుగా తాను కనపరిచిన పనితీరును 90 నిమిషాల చర్చాకార్యక్రమంతో తీసిపారేయలేరని బైడెన్‌ అన్నారు. ‘నేను వైదొలగాలని అంటున్నవారు కొద్దిమంది మాత్రమే. ఆర్థిక రంగాన్ని గాడిలోపెట్టి, నిరుద్యోగాన్ని తగ్గించి, ప్రపంచంలో అమెరికా స్థానాన్ని పునరుద్ధరించగలిగాను. ‘ప్రైమరీల ఎన్నికల్లో నాకు అనుకూలంగా ఇంతవరకు లక్షలమంది ఓట్లు వేశారు. మరి వైదొలగాలని కొంతమంది శాసనకర్తలు నన్ను ఎలా డిమాండ్‌ చేస్తున్నారు? నేను తప్పుకోను. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నా ధర్మం. పార్టీ అభ్యర్థిని నిర్ణయించాల్సింది వారేగానీ మరొకరు కాదు. సొంతపార్టీలో ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా దేశంలో ప్రజాస్వామ్యానికి అండగా మనం ఎలా నిలబడగలం? నేను అలా చేయను, చేయలేను’ అని స్వరంపెంచి స్పష్టంచేశారు. ట్రంప్‌ను ఓడించడమే ఇప్పుడు తమ ఏకైక కర్తవ్యమని చెప్పారు. సంకల్పం ఏమాత్రం సడలినా అది ట్రంప్‌నకు లబ్ధి కలిగిస్తుందన్నారు. 

తప్పుకోవాలంటున్న సొంత పార్టీ

పోటీ నుంచి బైడెన్‌ తప్పుకోవాలని పాలక డెమోక్రటిక్‌ పార్టీ ముఖ్యులే భావిస్తున్నారు. పార్లమెంటులో కీలక కమిటీల నాయకులైన అయిదుగురు డెమోక్రటిక్‌ పార్టీ ప్రముఖులు తాజాగా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇలాంటి అభిప్రాయాన్ని బహిరంగంగా కానీ, పరోక్షంలోగానీ వ్యక్తపరచిన డెమోక్రటిక్‌ నాయకుల సంఖ్య పదికి చేరింది. వీరంతా న్యాయవ్యవస్థ, సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్‌ కమిటీలలో సభ్యులే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని