బాంబులతో దద్దరిల్లిన గాజా

గాజా మరోసారి భయకంపితమైంది. నగరంపై ఇజ్రాయెల్‌ దళాలు ముప్పేట దాడి చేశాయి. హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి.

Published : 09 Jul 2024 03:57 IST

భయకంపితులైన జనం
రోడ్లపై పరుగులు

డెయిర్‌ అల్‌-బలా: గాజా మరోసారి భయకంపితమైంది. నగరంపై ఇజ్రాయెల్‌ దళాలు ముప్పేట దాడి చేశాయి. హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. నగరానికి మూడు వైపుల నుంచి బాంబు దాడులు.. మరోవైపు సముద్రం ఉండటంతో ఎటువైపు వెళ్లాలో తెలియక స్థానికులంతా రోడ్లపై పరుగులు తీశారు. ప్రాణ భయంతో వేల మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. గత ఏడాది అక్టోబరు 7 తర్వాత ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్ల్లో ఇదే అతి పెద్దదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు ఖతార్, అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ.. ఇంత భారీ స్థాయిలో ఇజ్రాయెల్‌ సేనలు విరుచుకుపడటం గమనార్హం. తాజా దాడులపై గాజా అత్యవసర పౌర సేవల విభాగం స్పందించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అయితే ఇప్పటికీ కాల్పులు కొనసాగుతుండటంతో వారి మృతదేహాలను తీసుకురావడం కష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గాజా తూర్పు ప్రాంతంలోని దరాజ్, టఫాతోపాటు పశ్చిమ దిక్కున ఉన్న టెల్‌-అల్‌-హవా, సర్బా, రిమాల్‌ ప్రాంతాల్లో కాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్‌ సేనలు ముందుగానే గాజా సరిహద్దులోని టెల్‌-అల్‌-హవా, సర్బా, రిమాల్‌ ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులను మోహరించాయి. ఫైటర్‌ జెట్‌లను సిద్ధం చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి. మూడువైపుల నుంచి ఒకేసారి దాడులు జరగడంతో ప్రాణ భయంతో వేల మంది ప్రజలు మధ్యధరా సముద్రతీరం వైపు పరుగులు తీశారు. తెల్లవారు జాము వరకూ కాల్పులు కొనసాగాయి.

ఎటు వెళ్లినా ప్రమాదమే!

ఈ దాడుల్లో పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. ‘మూడు వైపులా శత్రువులు, ఓ వైపు సముద్రం. మేమంతా ఎక్కడికి వెళ్లాలి.. ఎటు వెళ్లినా ప్రమాదమే’ అంటూ అక్కడి స్థానికుడొకరు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఓ వైపు ట్యాంకర్లు బాంబుల మోత మోగిస్తున్నాయి. మరోవైపు ఆకాశం నుంచి పిడుగులు పడినట్లుగా క్షిపణులు ఇళ్లపైనా, రోడ్లపైనా బీభత్సం సృష్టిస్తున్నాయి. మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి.. ఎక్కడికి వెళ్లాలి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు పక్కనే బిక్కుబిక్కు మంటూ ఉన్నాం’ అని మరో వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు.  హమాస్‌ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్‌ చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. తమ బలగాలకు ముప్పు తలపెట్టే అవకాశమున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని