చీలిన ఓటు.. దక్కని సీటు

అతివాదం, మితవాదం, మధ్యేవాదం.. ఈ మూడింటిలో ఎటువైపు వెళ్లాలనేది ఫ్రాన్స్‌ ఓటర్లు తేల్చుకోలేకపోయారు.

Published : 09 Jul 2024 04:07 IST

హంగ్‌దిశగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం
మెక్రాన్‌ ముంగిట రాజకీయ సంక్షోభం

పారిస్‌: అతివాదం, మితవాదం, మధ్యేవాదం.. ఈ మూడింటిలో ఎటువైపు వెళ్లాలనేది ఫ్రాన్స్‌ ఓటర్లు తేల్చుకోలేకపోయారు. శక్తిమంతమైన దిగువసభ ఎన్నికల ఫలితాల్లో తీర్పు అస్పష్టంగా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన 289 సీట్ల ఆధిక్యాన్ని సాధించడం కాదుకదా.. దానికి చేరువగా కూడా ఏ రాజకీయ పార్టీ రాలేకపోయింది. దీంతో రాజకీయ సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉంది. మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం ద్వారా స్పష్టమైన తీర్పును సాధిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ చెప్పినా.. దిగువసభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి పరిస్థితి తారుమారైంది. ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్‌ క్రీడలు పారిస్‌లో మొదలయ్యేందుకు మూడువారాల కంటే తక్కువ సమయమే మిగిలిన తరుణంలో రాజకీయ అనిశ్చితి తాండవిస్తోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేందుకు మెక్రాన్‌ వేచి చూస్తున్నారని అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది. 

ప్రధాని గాబ్రియెల్‌ రాజీనామా 

సోమవారం వెలువడిన ఫలితాల ప్రకారం 577 స్థానాలకు గాను వామపక్ష కూటమి 180 స్థానాల్లో విజయం సాధించింది. మెక్రాన్‌ కూటమి (160) రెండో స్థానంలో, అతి మితవాద కూటమి (140) మూడోస్థానంలో నిలిచాయి. పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని గాబ్రియెల్‌ అట్టల్‌ ప్రకటించారు. దానికి అధ్యక్షుడు నిరాకరించారు. ప్రభుత్వాధినేతగా తాత్కాలికంగా కొనసాగాలని కోరారు. ఒలింపిక్స్‌ ముగిసేవరకు గానీ, అవసరమైతే ఇంకా ఎక్కువకాలం పాటు కొనసాగేందుకు అట్టల్‌ సుముఖత వ్యక్తంచేశారు. కొత్త సభ్యులు పారిస్‌కు చేరుకుని చర్చలు ప్రారంభించనున్నారు. మెక్రాన్‌ పదవీకాలం ఇంకో మూడేళ్లు మిగిలిఉంది. ద్రవ్యోల్బణం, నేరాలు, వలసలు, ఇతర సమస్యలతో విసిగిపోయిన ఫ్రాన్స్‌ ప్రజలు మెక్రాన్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని భావిస్తున్నారు. 


తొలి అవకాశం ఇవ్వాలంటున్న వామపక్షం

ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మొదటి అవకాశం ఇవ్వాలని వామపక్షాలతో కూడిన ‘న్యూ పాపులర్‌ ఫ్రంట్‌’ నేతలు మెక్రాన్‌ను కోరుతున్నారు. మెక్రాన్‌ సంస్కరణల్లో దాదాపు అన్నింటినీ రద్దు చేస్తామని, ఇజ్రాయెల్‌పై కఠినంగా వ్యవహరిస్తామని ఆ కూటమి చెబుతోంది. కీలక పక్షాలతో కలవకుండా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తారనే స్పష్టత మాత్రం రాలేదు. ఏ పార్టీకి పార్లమెంటులో ఆధిక్యం లేని పరిస్థితిని ఆధునిక ఫ్రాన్స్‌ ఎన్నడూ ఎదుర్కోలేదు. సంకీర్ణ సర్కారు అనుభవం లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందనేది ఆసక్తికరంగా నిలుస్తోంది. 

నేరుగా చర్చలకు చొరవ తీసుకోండి: చైనా

తైపే: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నేరుగా చర్చలు జరిగేలా తమ శక్తినంతా ఉపయోగించాలని ప్రపంచ దేశాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సూచించారు. చర్చల కోసం రెండు దేశాలు కాల్పుల విరమణను పాటించాలని కోరారు. ఐరోపా సమాజానికి నేతృత్వం వహిస్తున్న హంగరీ ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ సోమవారం ఆకస్మికంగా చైనా వచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసేలా ప్రయత్నాలు చేస్తున్న ఆయన జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని