చిన్నారుల ఆసుపత్రిపై రష్యా దాడి

ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్‌లోని చిన్నారుల ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ ఘటనల్లో మొత్తం 31 మంది మరణించారు.

Updated : 09 Jul 2024 04:08 IST

ఉక్రెయిన్‌లో 31 మంది దుర్మరణం

ఓక్మిడిట్‌ చిన్నారుల ఆసుపత్రి వద్ద శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది, వాలంటీర్లు 

కీవ్‌: ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్‌లోని చిన్నారుల ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ ఘటనల్లో మొత్తం 31 మంది మరణించారు. 154 మంది గాయపడ్డారు. అత్యాధునిక కింజాల్‌ రాకెట్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ వాయుసేన ఆరోపించింది. ఉక్రెయిన్‌లోని ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర క్షిపణి దాడులు చేసింది. మొత్తం 40 క్షిపణులను ప్రయోగించింది. అవి అపార్టుమెంట్లు, ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. వాటిలో 30 క్షిపణులను అడ్డుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదని, రష్యా ఏం చేస్తుందో అందరూ చూడాలని సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో ‘నాటో’ శిఖరాగ్ర సమావేశాల వేళ ఈ దాడులు చేసుకోవడం గమనార్హం. కీవ్‌లోని 10 అంతస్తుల ఓక్మిడిట్‌ చిన్నారుల ఆసుపత్రిపై జరిగిన దాడిలో రెండంతస్తులు దెబ్బతిన్నాయి. శిథిలాల కింది బాధితుల కోసం సహాయక సిబ్బంది అన్వేషిస్తున్నారు. భవనం కిటీకీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులుసహా 16 మంది గాయపడ్డారని మేయర్‌ విటాలీ క్లిట్స్‌కో తెలిపారు. రష్యా దాడితో ఆసుపత్రిని తాత్కాలికంగా మూసి వేశారు. దీంతో పిల్లలను తీసుకుని తల్లులు ఇతర ఆసుపత్రులకు వెళ్లారు. మరికొందరు సాయం కోసం ఆసుపత్రివద్దే ఎదురుచూస్తున్నారు. ఆసుపత్రిపై దాడిని చెక్‌ రిపబ్లిక్‌తోపాటు జర్మనీ ఖండించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని