విషయగ్రహణ సామర్థ్యానికి ధూమపానంతో గండి

పొగతాగడం వల్ల శారీరక సమస్యలతో పాటు విషయగ్రహణ సామర్థ్యానికీ గండిపడుతుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

Updated : 09 Jul 2024 04:09 IST

దిల్లీ: పొగతాగడం వల్ల శారీరక సమస్యలతో పాటు విషయగ్రహణ సామర్థ్యానికీ గండిపడుతుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ధూమపానం అలవాటులేనివారితో పోలిస్తే వీరికి జ్ఞాపకశక్తి, మాట్లాడే నైపుణ్యం వంటివి క్షీణించడానికి 85 శాతం ఎక్కువ అవకాశం ఉందని వివరించారు. లండన్‌ యూనివర్సిటీ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు జీవనశైలికి సంబంధించిన 16 అంశాలను విశ్లేషించారు. శారీరక శ్రమ, మద్యపానం, కలుపుగోలుతనం వంటివి ఇందులో ఉన్నాయి. వార్ధక్యంతో ఎంత వేగంగా విషయగ్రహణ సామర్థ్యం క్షీణిస్తుందన్నదానిపై ప్రభావం చూపే అంశాల్లో ధూమపాన అలవాటు ముఖ్యమైందని గుర్తించారు. 14 ఐరోపా దేశాల్లో 32 వేల మందిని సర్వే చేసి ఈ అంశాన్ని తేల్చారు. వీరి వయసు 50 ఏళ్లు పైమాటే. పరిశోధనలో భాగంగా వీరిని 13 ఏళ్ల పాటు పరిశీలించారు. సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా పరీక్షార్థులను వారి ధూమపాన అలవాట్లు, శారీరక శ్రమ తీరు వంటి అంశాల ఆధారంగా భిన్న వర్గాలుగా విభజించారు. వారు స్నేహితులు, కుటుంబసభ్యులను వారంలో ఎన్నిసార్లు కలుస్తారు? మద్యపాన అలవాట్లు వంటి అంశాలనూ విశ్లేషించారు. ధూమపానం అలవాటులేనివారితో పోలిస్తే పొగరాయుళ్లలో పదేళ్ల కాలంలో విషయగ్రహణ సామర్థ్యం వేగంగా క్షీణిస్తున్నట్లు గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని