సంక్షిప్త వార్తలు

జబ్బుపడనంత వరకూ- పోషకాహారం మనకు ఖరీదైనదిగానే కనిపిస్తుంది. శక్తిని పూర్తిగా కోల్పోయేదాకా- వ్యాయామమంటే సమయం వృథా చేసుకోవడంగానే అనిపిస్తుంది.

Published : 10 Jul 2024 04:07 IST

ఆరోగ్యం దెబ్బతినకముందే మేల్కోండి!

జబ్బుపడనంత వరకూ- పోషకాహారం మనకు ఖరీదైనదిగానే కనిపిస్తుంది. శక్తిని పూర్తిగా కోల్పోయేదాకా- వ్యాయామమంటే సమయం వృథా చేసుకోవడంగానే అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండటం కొంచెం కష్టమైన విషయమే. కానీ అనారోగ్యం బారిన పడితే పరిస్థితి అంతకంటే చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి త్వరగా మేల్కోండి!

డాన్‌ గో, ఫిట్‌నెస్‌ కోచ్‌


మోదీ రష్యా పర్యటనతో బలమైన సందేశం

రష్యా వ్యతిరేక కూటమి అయిన నాటో భేటీ వాషింగ్టన్‌లో జరుగుతుండగానే.. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని (మోదీ)కి మాస్కో ఆతిథ్యమిచ్చింది. తద్వారా- తాను ఒంటరి కాదని, తనకు మిత్రులు ఉన్నారని, ఉక్రెయిన్‌కు నాటో మద్దతుగా నిలిచినా యుద్ధంలో గెలిచేది రష్యాయేనని పుతిన్‌ బలమైన సందేశమిచ్చినట్లయింది. 16 వేలకుపైగా ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ పాశ్చాత్య దేశాల కంటే రష్యా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా వృద్ధి చెందుతోంది కూడా. ఇక మోదీ ఈ పర్యటనతో భారత వ్యూహాత్మక స్వతంత్రతను చాటారు. 

పాల్కీ శర్మ, పాత్రికేయురాలు


లక్ష్యసాధనకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోవాలి

స్వీయ క్రమశిక్షణ కలిగిన వ్యక్తులకు ఇతరుల కంటే ఎక్కువ సంకల్ప బలమేమీ ఉండదు. కానీ మిగిలినవారితో పోలిస్తే తేడా ఏంటంటే.. తమ లక్ష్యాలను సులువుగా చేరుకునేందుకు వీలుగా పరిస్థితులను ఎలా మార్చుకోవాలో వారు వేగంగా గుర్తిస్తారు. వాతావరణాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటారు.

లీలా హార్మోజీ, వ్యాపారవేత్త


అరణ్యాలతో లాభాలు పుష్కలం

పుడమికి, ప్రజలకు అడవులు అత్యంత కీలకం. అవి కార్బన్‌ను నిల్వ చేస్తాయి. గాలిని శుభ్రం చేస్తాయి. నేలను సారవంతంగా మారుస్తాయి. స్థానికంగా ఉద్యోగాలను సృష్టిస్తాయి. పరిశ్రమలకు అండగా నిలుస్తాయి. చెప్పుకొంటూ పోతే అరణ్యాల వల్ల లాభాలెన్నో! వాటిని పరిరక్షించడం మనందరి బాధ్యత. 

ప్రపంచ బ్యాంకు


పాఠశాలపై ఇజ్రాయెల్‌ దాడి.. 29 మంది మృతి

గాజాసిటీ: ఇజ్రాయెల్‌ మంగళవారం సాయంత్రం దక్షిణ గాజాలో ఓ పాఠశాలపై జరిపిన వైమానిక దాడిలో 29 మంది చనిపోయారు. డజన్లకొద్దీ గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని పాలస్తీనా అధికారులు తెలిపారు. ఖాన్‌ యూనిస్‌లో గాజా శరణార్థులు తలదాచుకుంటున్న శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని