టెక్సాస్‌లో మానవ అక్రమ రవాణా.. నలుగురు భారతీయ అమెరికన్ల అరెస్టు

మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణపై అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఒక మహిళ సహా నలుగురు భారతీయ అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 10 Jul 2024 04:09 IST

హ్యూస్టన్‌: మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణపై అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఒక మహిళ సహా నలుగురు భారతీయ అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. మంచాలకు నల్లుల బెడదను నిర్మూలించడానికి ఓ క్రిమి సంహారక మందుల కంపెనీని పిలిపించినప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. ఆ ఇంట్లో ప్రతి గదిలో ముగ్గురి నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది యువతులు నిద్రిస్తుండడం, పెద్దసంఖ్యలో సూట్‌కేసులు ఉండడాన్ని కంపెనీ ప్రతినిధి గుర్తించి, అనుమానంతో పోలీసుల్ని అప్రమత్తం చేశారు. వారు విచారణ చేపట్టి చందన్‌ దసిరెడ్డి (24), ద్వారకా గుండా (31), సంతోష్‌ కట్కూరి (31), అనిల్‌ మాలె (37) అనే నలుగురిని మార్చి నెలలోనే అదుపులో తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా అభియోగాలను వీరిపై తాజాగా నమోదు చేశారు. మరికొంతమందిని అరెస్టు చేయనున్నారు. ఆ ఇంట్లో కంప్యూటర్‌ సామగ్రి తప్పిస్తే ఎలాంటి ఫర్నిచర్‌ లేదని, అందరూ నేలపైనే నిద్రిస్తున్నారని పోలీసులు చెప్పారు. కట్కూరి, ఆయన భార్య ద్వారక కలిసి బలవంతంగా వివిధ కంపెనీల్లో యువతుల చేత పనులు చేయిస్తున్నారని విచారణలో తేలింది. వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరిపి అనేక లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, నకిలీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది పురుషులతో కూడా బలవంతంగా చాకిరీ చేయిస్తున్నట్లు తేలింది. దీనిలో మరో 100 మంది పాత్ర ఉందని, సగం మంది బాధితులేనని ప్రిన్స్‌టన్‌ పోలీసులు వెల్లడించారు. ఏయే పనుల కోసం వీరిని అక్రమంగా వాడుతున్నదీ బయటపెట్టలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని