యుద్ధరంగంలో పరిష్కారం లేదు

ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతమైందని భారత్‌ ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రధాని స్పష్టమైన అభిప్రాయాన్ని పుతిన్‌తో పంచుకున్నారని తెలిపింది.

Published : 10 Jul 2024 04:11 IST

మాస్కో, కీవ్‌ ఘర్షణపై భారత్‌ స్పష్టీకరణ
మోదీ రష్యా పర్యటన విజయవంతమైందని వెల్లడి

మాస్కో, దిల్లీ: ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతమైందని భారత్‌ ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రధాని స్పష్టమైన అభిప్రాయాన్ని పుతిన్‌తో పంచుకున్నారని తెలిపింది. యుద్ధ రంగంలో పరిష్కారం లభించబోదని పుతిన్‌కు తేల్చి చెప్పారని వెల్లడించింది. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే రష్యా, ఉక్రెయిన్‌ ఘర్షణకు పరిష్కారం లభించగలదని నమ్ముతున్నామని, యుద్ధ రంగంలో కాదని భారత్‌ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌కు అనుగుణంగా ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఎప్పటికీ గౌరవిస్తామని పేర్కొంది. రష్యా చేసే ఏ తీర్మానమైనా ఐరాస చార్టర్‌కు కట్టుబడి ఉండాలనే విషయాన్ని చర్చల సందర్భంగా పుతిన్‌కు మోదీ స్పష్టం చేయాలని అమెరికా సూచించిన నేపథ్యంలో భారత్‌ స్పందించింది. 

మోదీ, పుతిన్‌ ఆలింగనంపై జెలెన్‌స్కీ విమర్శ

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, పుతిన్‌ల ఆప్యాయ ఆలింగనంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. ‘ఉక్రెయిన్‌లో సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. 13 మంది పిల్లలసహా 170 మంది గాయపడ్డారు. ఆ వెంటనే మరో చిన్నారుల ఆసుపత్రిపై రష్యా క్షిపణి విరుచుకుపడింది. ఎంతోమంది శిథిలాల కింద సమాధయ్యారు. అలాంటి రోజున ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నాయకుడు (మోదీని ఉద్దేశిస్తూ).. ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్థుడిని (పుతిన్‌ను ఉద్దేశిస్తూ) మాస్కోలో ఆలింగనం చేసుకున్నారు. ఇది తీవ్ర నిరాశ కలిగించింది. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ’ అని జెలెన్‌స్కీ ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు. రష్యా దాడికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారత్‌ మాకు వ్యూహాత్మక భాగస్వామి: అమెరికా

భారత్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా తెలిపింది. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంది. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని తెలిపింది. మోదీ రష్యా పర్యటన, ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో అగ్రరాజ్యం స్పందించింది. పుతిన్‌తో చర్చల్లో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రస్తావించాలని మోదీకి అమెరికా సూచించింది. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఉక్రెయిన్‌ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్‌కు స్పష్టం చేయాలని చెప్పుకొచ్చింది. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతామని అగ్రరాజ్య విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. 

అమరవీరుల స్మారకం వద్ద మోదీ నివాళి

మాస్కోలోని అమరవీరుల స్మారకంవద్ద మోదీ నివాళులర్పించారు. క్రెమ్లిన్‌ వాల్‌ సమీపంలో ఈ స్మారకం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మారకార్థం రష్యా దీనిని నిర్మించింది. 

రష్యా సైనికులు వేసుకునే బూట్లు మనవే

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా సైనికులకు మన దేశం నుంచే బూట్లు సరఫరా అవుతున్నాయి. బిహార్‌లోని హాజీపుర్‌లో ఉన్న ఓ కంపెనీ ఈ బూట్లను తయారు చేస్తోంది. కాంపిటెన్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ 2018లో ప్రారంభమైంది. ఇందులో రష్యా సైనికుల కోసం బూట్లు తయారు చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా రష్యా సైనికుల పాదాలను హాజీపుర్‌ బూట్లు రక్షిస్తాయి. అందుకే వీటిని రష్యా సైనికుల కోసం ఆ దేశం ఎంచుకుంది. ‘మా కంపెనీలో పని చేసే 300 మంది ఉద్యోగుల్లో 70శాతం మంది మహిళలే. మేము ఏడాదిగా రూ.100 కోట్ల విలువైన 15లక్షల జతల బూట్లను రష్యాకు ఎగుమతి చేశాం’ అని కాంపిటెన్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ శివ్‌ కుమార్‌ రాయ్‌ తెలిపారు.


గోల్ఫ్‌కార్ట్‌లో మోదీ, పుతిన్‌ షికారు

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి విశేష గౌరవం లభిస్తోంది. సోమవారం రాత్రి విందు సందర్భంగా ఆయన వెంటే ఉండి తన అధికారిక నివాసాన్ని పుతిన్‌ చూపించారు. ఆ సమయంలో వారిద్దరూ గోల్ఫ్‌ కార్ట్‌లో షికారు చేశారు. ఆ ఇంటి ప్రాంగణంలో తిరుగుతూ ముచ్చటించుకున్నారు. ఆ కార్ట్‌ను పుతిన్‌ స్వయంగా నడిపారు. వెనక సీటులో రెండు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూర్చున్నారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తర్వాత కార్ట్‌ దిగి వారిద్దరే ముచ్చటించుకుంటూ కొద్దిదూరం నడిచారు. ఆ క్షణాలు తనకెంతో ఆనందాన్నిచ్చాయని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంగా వారిద్దరూ అనువాదకుల సహాయంతో తమ అభిప్రాయాలు పంచుకున్నప్పటికీ.. ఇద్దరే కలిసి నడుస్తున్నప్పుడు మాత్రం ఆంగ్లంలో సంభాషించుకున్నట్లు స్థానిక మీడియా కథనం పేర్కొంది.


పౌర అణు ఇంధన మ్యూజియం సందర్శన

భారత్, రష్యాల మధ్య సహకారంలో ఇంధన బంధం అత్యంత కీలకమైన పిల్లర్‌ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రంగంలో మరింతగా బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ఆయన రోసాటోం పెవిలియన్‌ను సందర్శించారు. పౌర అణు ఇంధన మ్యూజియంలో చిత్ర ప్రదర్శనను తిలకించారు. 2023లో ప్రారంభించిన ఈ మ్యూజియం అతి పెద్దది. ఆటం పెవిలియన్‌నూ పుతిన్‌తో కలిసి మోదీ సందర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని