‘బెరిల్‌’ తుపాను చీకట్లో టెక్సాస్‌

శక్తిమంతమైన ఉష్ణమండల తుపాను ‘బెరిల్‌’ ధాటికి అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం విలవిలలాడింది. తీవ్రమైన గాలులు, వరదలతో జనజీవనం స్తంభించింది.

Published : 10 Jul 2024 04:11 IST

నలుగురి మృత్యువాత.. 30 లక్షల ఇళ్లకు విద్యుత్తు నిలిపివేత

బెరిల్‌ తుపాను తీవ్రతకు హ్యూస్టన్‌లో చెట్టుకూలి ధ్వంసమైన ఇల్లు

హ్యూస్టన్‌: శక్తిమంతమైన ఉష్ణమండల తుపాను ‘బెరిల్‌’ ధాటికి అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం విలవిలలాడింది. తీవ్రమైన గాలులు, వరదలతో జనజీవనం స్తంభించింది. వివిధ ప్రాంతాల్లో కనీసం నలుగురు వ్యక్తులు మృత్యువాతపడగా.. దాదాపు 30 లక్షల ఇళ్లు, దుకాణాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. పాఠశాలలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. మటగోడా వద్ద మట్టిపెళ్లలు విరిగిపడినట్లు జాతీయ తుపాను కేంద్రం సోమవారం సాయంత్రం తెలిపింది. తూర్పు టెక్సాస్, పశ్చిమ లూసియానా, అర్కన్సాస్‌లలోని పలు ప్రాంతాల్లో తుపాను వర్షాలతోపాటు టోర్నడోలు కూడా ఉండవచ్చని పేర్కొంది. ఇళ్లపై చెట్లు కూలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, హ్యూస్టన్‌ పోలీసు ఉద్యోగి వరదనీట చిక్కి మృత్యువాతపడ్డాడు. అగ్నిప్రమాదంలో మరో వ్యక్తి చనిపోయాడు. వరదనీరు తగ్గుముఖం పడుతుండటంతో అధికారుల సూచన మేరకు సోమవారం రాత్రంతా ప్రజలు ఇళ్లలోనే గడిపారు. మరోవైపు.. అధికారులు సహాయకచర్యలు కొనసాగించారు. పలుచోట్ల రోడ్డు జలమయం కావడంతోపాటు చెట్లు, శిథిలాలు అడ్డంగా పడి ఉండటంతో రోడ్డు రవాణా పునరుద్ధరణకు మరికొన్ని రోజులు పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు. మంగళవారం కూడా పాఠశాలలు తెరుచుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని