బోయింగ్‌ విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు

లాస్‌ ఏంజెలిస్‌: ఈ మధ్య బోయింగ్‌ విమానాల్లో వరుసగా సాంకేతిక, ఇతర సమస్యలు తలెత్తడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.

Published : 10 Jul 2024 04:12 IST

లాస్‌ ఏంజెలిస్‌: ఈ మధ్య బోయింగ్‌ విమానాల్లో వరుసగా సాంకేతిక, ఇతర సమస్యలు తలెత్తడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ సంస్థ తయారు చేసిన మరో విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే టైరు ఊడి పడిపోయింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 757-200 విమానం సోమవారం లాస్‌ ఏంజెలిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్‌ గేర్‌ టైర్‌ ఊడిపోయింది. అనంతరం విమానం డెన్వర్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం నుంచి టైరు ఊడిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ ఘటనపై యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ... ఊడిన టైరు లాస్‌ ఏంజెలిస్‌లో లభించిందని, ఘటనపై విచారణ జరుపుతామని తెలిపింది. మార్చిలో ఇదే సంస్థకు చెందిన బోయింగ్‌ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌ బయల్దేరగా.. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే టైరు ఊడిపోయింది. దీంతో విమానాన్ని లాస్‌ ఏంజెలిస్‌లో అత్యవసరంగా దించేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని