మళ్లీ చర్చకు రాగలరా?.. గోల్ఫ్‌ ఆడగలరా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మున్ముందుకు వెళ్తున్నకొద్దీ వాగ్బాణాలు పదునెక్కుతున్నాయి.

Published : 11 Jul 2024 04:22 IST

బైడెన్‌కు సవాల్‌ విసిరిన ట్రంప్‌
నెగ్గితే 10 లక్షల డాలర్లు ఇస్తానని వెల్లడి 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మున్ముందుకు వెళ్తున్నకొద్దీ వాగ్బాణాలు పదునెక్కుతున్నాయి. పీఠాన్ని మరోసారి ఆశిస్తున్న అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పరం సవాళ్లు విసురుకుంటూ అగ్రరాజ్య ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్, తన ప్రత్యర్థి, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు తాజాగా ఓ ప్రతిపాదన చేశారు. తనతో మరో విడత చర్చించేందుకు, గోల్ఫ్‌ ఆడడానికి సిద్ధమా అని ఫ్లోరిడా సభలో సవాల్‌ విసిరారు. ప్రపంచం ముందు బైడెన్‌ తనను తాను నిరూపించుకునే మరో అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ‘చర్చలో ప్రయోక్తలు లేకుండా మనమిద్దరమే ఉందాం. ఆంక్షలు ఏమీ లేకుండా చర్చిద్దాం. ఎక్కడకు ఎప్పుడు రావాలో చెప్పండి. నేను సిద్ధం’ అని అన్నారు. గోల్ఫ్‌ మ్యాచ్‌లో బైడెన్‌ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంద సంస్థకు 10 లక్షల డాలర్ల విరాళం ఇస్తానని ట్రంప్‌ ప్రకటించారు. 

ఆడేందుకు బైడెన్‌ ఖాళీగా లేరు

ఈ సవాల్‌ను బైడెన్‌ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్‌ విచిత్రమైన చేష్టలకు సమాధానం చెప్పేందుకు, ఆటలకు ఆయనకు సమయం లేదని తెలిపాయి. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను లక్ష్యంగా చేసుకొని ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యలు చేశారు. హారిస్‌ను బైడెన్‌కు బీమా పాలసీగా అభివర్ణించారు. అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై చర్చ మొదలైన నేపథ్యంలో ఈ వ్యాఖ్య చేశారు. కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం బైడెన్‌ తీసుకున్న అద్భుతమైన నిర్ణయమని అన్నారు. అమెరికా సరిహద్దు రక్షణ, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నిలువరించడమనే బాధ్యతల్ని ఆమెకు అప్పగించినా వాటిలో విఫలమయ్యారని విమర్శించారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చాలని ట్రంప్‌ కోరుకుంటున్నారని హారిస్‌ ఆరోపించారు. 

‘అధ్యక్షుడికి పార్కిన్సన్స్‌ చికిత్స జరగలేదు’

అధ్యక్షుడు బైడెన్‌కు పార్కిన్సన్స్‌ చికిత్స జరిగిందన్న ప్రచారాన్ని శ్వేతసౌధం ఖండించింది. మరోసారి ఎన్నికైతే పూర్తికాలం సేవలందించేందుకు ఆయన కట్టుబడి ఉన్నారని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని