గాజాను ఖాళీ చేయాలన్న సైన్యం

పాలస్తీనావాసులంతా గాజాను వీడి దక్షిణంవైపు వెళ్లాలని ఇజ్రాయెల్‌ సైన్యం కోరింది. తాజా దాడుల నేపథ్యంలో ఈ మేరకు పిలుపునిచ్చింది.

Published : 11 Jul 2024 04:14 IST

ఇజ్రాయెల్‌ తాజా దాడిలో 20 మంది మృతి

డెయిర్‌ అల్‌-బలా: పాలస్తీనావాసులంతా గాజాను వీడి దక్షిణంవైపు వెళ్లాలని ఇజ్రాయెల్‌ సైన్యం కోరింది. తాజా దాడుల నేపథ్యంలో ఈ మేరకు పిలుపునిచ్చింది. గాజా నగరంతోపాటు ఉత్తర ప్రాంతంలోనివారంతా అటువైపు వెళ్లాలని సూచించింది. ‘అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతం’గా గాజా నగరం ఉంటుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ దళాలు బుధవారం తెల్లవారుజామున జరిపిన గగనతల దాడుల్లో గాజాలో 20 మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆరుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించినచోట ఉన్నవారూ ప్రాణాలు కాపాడుకోలేకపోయారని తెలుస్తోంది. డెయిర్‌ అల్‌-బలా, సమీపంలోని శరణార్థ శిబిరాలపై రాత్రిపూట దాడులు వరసగా రెండ్రోజులుగా జరుగుతున్నాయి. కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం చర్చలు జరిపేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్‌లకు చెందిన మధ్యవర్తులు ఖతార్‌ రాజధాని దోహాకు చేరుకున్న సమయంలోనే భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ప్రతిష్టంభనను తొలగించే మార్గాలపై ఈ దేశాల ప్రతినిధులు సమాలోచనలు జరిపారు. ఏ ఒప్పందం జరగాలన్నా ముందుగా యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ విరమించాలన్న డిమాండ్‌ విషయంలో హమాస్‌ కాస్త మెత్తబడింది. శాశ్వత ప్రాతిపదికన కాల్పుల విరమణకు మధ్యవర్తులు హామీ ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని