మెదడు సైజుకు శరీర బరువుతో సంబంధం లేదు

ఒక జీవి శరీరం ఎంత పెద్దగా ఉంటే.. దాని మెదడు కూడా అదే నిష్పత్తిలో పెద్దగా ఉంటుందని శతాబ్దాలుగా భావించేవారు.

Published : 11 Jul 2024 04:23 IST

దిల్లీ: ఒక జీవి శరీరం ఎంత పెద్దగా ఉంటే.. దాని మెదడు కూడా అదే నిష్పత్తిలో పెద్దగా ఉంటుందని శతాబ్దాలుగా భావించేవారు. ఇది తప్పని బ్రిటన్‌లోని రీడింగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పైపెచ్చు  శరీర పరిమాణంతో సంబంధం లేకుండా కొన్ని జీవుల్లో బుర్ర పరిమాణం ఉంటోందని వారు తెలిపారు. అంటే.. కొన్ని పెద్ద జంతువులకు.. ఊహించినదాని కన్నా చిన్న మెదళ్లు ఉన్నట్లు తెలిపారు. 

ఇతర క్షీరదాల కన్నా మానవులు 20రెట్లు వేగంగా పరిణామం చెందారు. శరీర పరిమాణంతో పోలిస్తే మనుషుల్లో పెద్ద మెదళ్లు ఉన్నాయి. పెద్ద బుర్ర ఉంటే మేధస్సు ఎక్కువగా ఉంటుంది. సామాజిక బంధాలు దృఢంగా ఉంటాయి. అలాగే సంక్లిష్ట వ్యవహారశైలి ప్రదర్శించగలుగుతారు. వానరాలు, మూషికాలు, మాంసాహార జీవులూ ఈ పోకడను ప్రదర్శిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. శరీరంతో పోలిస్తే మెదడు పరిమాణాన్ని కాలానుగుణంగా పెంచుకోవాలన్న దృక్పథం ఈ జాతుల్లో కనిపిస్తోందన్నారు. అయితే గతంలో భావించినట్లు అన్ని క్షీరదాల్లో ఈ ధోరణి లేదని చెప్పారు. అవసరాన్ని బట్టి క్షీరదాల్లో పెద్ద, చిన్న మెదళ్ల దిశగా వేగవంతమైన మార్పులు కనిపిస్తున్నట్లు వివరించారు. అయితే పెద్ద జంతువుల్లో బుర్ర పెద్దది కాకుండా ఏదో అడ్డుపడుతున్నట్లు తెలిపారు. నిర్దిష్ట పరిమాణం కన్నా పెద్దగా ఉండే మెదడు నిర్వహణ కష్టం కావడం ఇందుకు కారణమా అన్నది పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పక్షుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించిందన్నారు. గబ్బిలాలు ఆవిర్భవించాక.. మొదట్లో అవి వేగంగా తమ మెదడు పరిమాణాన్ని తగ్గించుకున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆ మార్పులు తగ్గుముఖం పట్టాయన్నారు. గగనవిహార అవసరాల కారణంగా ఆ జీవుల బుర్రల ఎదుగుదలపై పరిమితులు ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని