Sunita Williams: భారత వ్యోమగాములతో భేటీకి ఎదురుచూస్తున్నా: ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌

భారత వ్యోమగాములను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ (Sunita Williams) పేర్కొన్నారు. 

Published : 11 Jul 2024 14:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్న భారత వ్యోమగాములను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ (Sunita Williams) పేర్కొన్నారు. ‘అమెరికా ఇండిపెండెన్స్‌ డే’ సందర్భంగా ఐఎస్‌ఎస్‌ నుంచి దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి పంపిన సందేశంలో ఈ విషయం పేర్కొన్నారు. ‘‘అంతరిక్ష అన్వేషణలో భారత్‌-అమెరికాలు చాలా విజయాలు సాధించాయి. ఒకవేళ ఇది జరగకపోతే మన భవిష్యత్తు ఇంత కాంతిమంతంగా ఉండేది కాదు’’ అని ఆమె పేర్కొన్నారు. 

ఇస్రో-నాసా జాయింట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు భారత వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవిషయాన్ని గత నెల ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు షెడ్యూల్‌ ప్రకారమే సాగుతోందని పేర్కొన్నారు.

మొత్తం నలుగురుని దీనికి ఎంపిక చేసి వారికి వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. వీరిలో ఇద్దరిని మాత్రం నాసా శిక్షణకు పంపిస్తామని వెల్లడించారు. మిగిలిన ఇద్దరికీ విభిన్న పద్ధతుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అంతరిక్ష యాత్రలో పని చేసేందుకు వీలుగా పలువురు ఇంజినీర్లకు కూడా నాసా శిక్షణ ఇవ్వనుంది. 

బోయింగ్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ ‘స్టార్‌లైనర్‌’ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన సునీతా (Sunita Williams) తాము అందులోనే వెనక్కి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. కొన్ని వారాల కిందటే తిరిగి రావాల్సినవారు స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఈనేపథ్యంలో బుధవారం సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్‌ విల్‌మోర్‌లు అంతరిక్షం నుంచి తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. థ్రస్టర్‌ పరీక్ష పూర్తయ్యాక తమ తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని