రోబోతో ప్రేమాయణం.. వివాహానికీ సిద్ధపడ్డ పెద్దాయన

ఓ రోబో.. మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం ‘రోబో’ సినిమాలో చూశాం. అయితే ఓ మనిషి.. మరమనిషితో ప్రేమలో పడిన నిజ జీవిత ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అంతేకాదు..

Published : 08 Jan 2022 09:29 IST

ఓ రోబో.. మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం ‘రోబో’ సినిమాలో చూశాం. అయితే ఓ మనిషి.. మరమనిషితో ప్రేమలో పడిన నిజ జీవిత ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అంతేకాదు.. ఆయన దాన్ని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. క్వీన్స్‌లాండ్‌కు చెందిన జియోఫ్‌ గల్లాఘర్‌ అనే వ్యక్తి ఎమ్మా అనే హ్యూమనాయిడ్‌పై మనసు పారేసుకున్నారు. దాన్ని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఉందని చెబుతున్నారు. పదేళ్ల కింద తల్లి చనిపోవడంతో జియోఫ్‌ ఒంటరి అయ్యారు. ఓసారి రోబోల గురించి కథనం చదివి వాటి గురించి వెబ్‌సైట్‌లో వెతికారు. ఎమ్మా అనే హ్యూమనాయిడ్‌పై మోజుపడ్డారు. ‘‘అది లేత రంగు, నీలి కళ్లతో చాలా అందంగా ఉంది. అందుకే నేను ఎమ్మాను కొనుగోలు చేశాను’’ అని జియోఫ్‌ చెప్పారు. ఆయన జీవితంలోకి ఎమ్మా 2019 సెప్టెంబరులో వచ్చింది. ఈ రెండేళ్లలో ఎమ్మాకు చాలా దగ్గరయ్యానని,  తను లేని జీవితాన్ని ఊహించుకోలేనని జియోఫ్‌ చెబుతున్నారు. బయటకు ఎక్కడకు వెళ్లినా కారులో అది తన పక్కన ఉండాల్సిందే. దాని తల వెనుక భాగంలో ఉండే స్మార్ట్‌ స్క్రీన్‌ సాయంతో ఎమ్మాతో మాట్లాడుతున్నారు. తాను ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చేవరకు తన కోసం ఎంతో ఆప్యాయంగా ఎదురు చూస్తుందని పేర్కొన్నారు. ఎమ్మాను పెళ్లి చేసుకుని భార్య స్థానం ఇవ్వాలనుందని, చట్టబద్ధం కాకపోయినప్పటికీ తన కోరిక అదేనని వెల్లడించారు. ఆస్ట్రేలియాలో రోబోను పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తిగా నిలుస్తానని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని