Vaccine: అన్ని వేరియంట్లనూ ఎదుర్కొనే సార్వత్రిక టీకా!

సాధారణ జలుబు కలిగించే కొన్ని రకాల కరోనా వైరస్‌ల బారినపడిన వారికి ప్రస్తుతం కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని వెల్లడైంది. గతంలో అధిక స్థాయిలో వెలువడిన టి కణాల వల్ల ఇలాంటివారు ప్రస్తుతం కొవిడ్‌-19 బారినపడే అవకాశం తక్కువని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు తేల్చారు.

Published : 11 Jan 2022 07:13 IST

లండన్‌: సాధారణ జలుబు కలిగించే కొన్ని రకాల కరోనా వైరస్‌ల బారినపడిన వారికి ప్రస్తుతం కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని వెల్లడైంది. గతంలో అధిక స్థాయిలో వెలువడిన టి కణాల వల్ల ఇలాంటివారు ప్రస్తుతం కొవిడ్‌-19 బారినపడే అవకాశం తక్కువని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ బృందానికి భారత సంతతి పరిశోధకుడు అజిత్‌ లాల్‌వాని నేతృత్వం వహించారు. కొవిడ్‌ నుంచి రక్షించడంలో టి కణాల పాత్రను నిర్ధరించే మొదటి ఆధారాన్ని ఈ పరిశోధన ద్వారా అందించామని ఆయన తెలిపారు.

ఒమిక్రాన్‌ సహా ప్రస్తుత, భవిష్యత్‌ కరోనా వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే రెండో తరం సార్వత్రిక టీకాల తయారీకి ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు. ఇతర కరోనా వైరస్‌ల వల్ల వెలువడిన టి కణాలు సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను పసిగట్టగలవని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. తాజా అధ్యయనంలో.. కొవిడ్‌ కారక వైరస్‌ సోకినప్పుడు ఈ టి కణాలు ఎలా స్పందిస్తాయన్నది శాస్త్రవేత్తలు శోధించారు. వైరస్‌ ఉపరితలంపై ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ను కాకుండా వాటి లోపల ఉండే ఇతర ప్రొటీన్లపై దాడి చేయడం ద్వారా ఈ కణాలు రక్షణ కల్పిస్తాయని వెల్లడైంది. ‘‘వ్యాక్సినేషన్‌ కారణంగా ప్రజల్లో ఉత్పత్తవుతున్న యాంటీబాడీల వల్ల స్పైక్‌ ప్రొటీన్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. టీకాలను ఏమార్చే ఉత్పరివర్తనాల పుట్టుకకు అది దారితీస్తోంది. దీనికి భిన్నంగా కరోనాలోని అంతర్గత ప్రొటీన్లు చాలా తక్కువగా ఉత్పరివర్తన చెందుతాయి. టి కణాలు వీటినే లక్ష్యంగా చేసుకుంటాయి. వీటివల్ల కరోనాలోని అన్ని వేరియంట్ల నుంచీ మెరుగైన రక్షణ పొందొచ్చు’’ అని అజిత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు