Updated : 15/01/2022 14:43 IST

బ్రిటన్‌ ప్రధానికి పదవీ గండం!

విందుల వివాదంలో బోరిస్‌ జాన్సన్‌

కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో... ప్రిన్స్‌ ఫిలిప్స్‌ అంత్యక్రియల వేళ...

అధికారిక నివాసంలో రాత్రంతా  మద్యం పార్టీలు, నృత్యాలు

డైలీ టెలిగ్రాఫ్‌ తాజా కథనం

లండన్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ రాజకీయ భవిష్యత్తుపై ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. కొవిడ్‌ మహమ్మారి కోరలు చాసి వేల మంది ప్రజలను కబళిస్తున్న వేళ అధికారిక నివాసంలో సిబ్బందితో కలిసి విందులు జరుపుకున్నారనే విమర్శలు ఆయన పదవికే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. విపక్షంతో పాటు స్వపక్షం నుంచీ రాజీనామా చేయాలన్న డిమాండ్లు అధికమవుతుండగానే మరో వివాదం ఆయనకు చుట్టుకుంది. దేశాధినేత రాణి ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణంతో దేశమంతా శోకసంద్రంలో ఉన్న సమయంలోనూ ప్రధాని కార్యాలయ సిబ్బంది ఓ రాత్రంతా మద్యం సేవిస్తూ నృత్యాలు చేస్తూ గడిపారనే విషయం తాజాగా వెలుగుచూసింది. అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి అనుకూల పత్రికగా భావించే ‘డైలీ టెలిగ్రాఫ్‌’ శుక్రవారం దీనిని బయటపెట్టింది. ఈ పరిస్థితుల్లో బోరిస్‌ జాన్సన్‌ పదవి నుంచి తప్పుకోక తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టేందుకు అధిక అవకాశాలున్నాయని తెలుస్తోంది.

కొవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న 2020 మే నెలలో ప్రధాని అధికార నివాసంలో బోరిస్‌ జాన్సన్‌, మరో 30 మంది వరకూ మద్యం పార్టీలో మునిగిపోయారనే వివాదంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అది అలా ఉండగానే గత ఏడాది ఏప్రిల్‌ 17న కూడా ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’లో ఆయన కార్యాలయ సిబ్బంది రాత్రి పొద్దుపోయే వరకు విందు, వినోదాల్లో మునిగిపోయారని ‘డైలీ టెలిగ్రాఫ్‌’ తాజాగా వెల్లడించింది. ఆ విందులో ప్రధాని ఉన్నట్లుగా తెలియడంలేదు. అయితే, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ అంత్యక్రియలకు ముందు రోజు రాత్రి జరిగినట్లుగా చెబుతున్న ఈ విందుపై రాజకీయ వర్గాలతో పాటు దేశ ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ ప్రజలందరూ సంతాప దినాలను పాటిస్తున్న సమయంలో పీఎం కార్యాలయ సిబ్బంది విందులు, వినోదాలు చేసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీనిని ‘పార్టీగేట్‌’ కుంభకోణంగా అభివర్ణిస్తున్నారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నుంచీ ప్రధాని జాన్సన్‌పై విమర్శలు తీవ్రమయ్యాయి.

తదుపరి ప్రధాని రేసులో రిషి సునాక్‌
ప్రధాని పదవికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయాల్సి వస్తే బ్రిటన్‌ అధికార పగ్గాలు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. ప్రస్తుతం ఆయన జాన్సన్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రి. పాలనా వ్యవహారాల్లో సమర్థుడిగా పేరుగడించారు. బోరిస్‌ పార్లమెంటులో క్షమాపణలు చెబుతున్న సమయంలో రిషి అక్కడ లేకపోవడంపై ఆ దేశంలోని ప్రధాన పత్రికలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రధానిపై వస్తున్న ఆరోపణల నుంచి దూరంగా ఉండే ఉద్దేశంతోనే ఆయన సభకు రాలేదని పేర్కొన్నాయి.

బెట్టింగ్‌ల్లోనూ ఆ పేరే...

రాజకీయ ఊహాగానాలపై ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహించే ‘బెట్‌ఫెయిర్‌’ అనే సంస్థ కూడా  బోరిస్‌ తప్పుకొంటే ప్రధాని రేసులో రిషి సునాక్‌కు అత్యధిక మంది మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రిషి తర్వాతి స్థానంలో మంత్రులు లిజ్‌ ట్రస్‌, మైకేల్‌ గోవ్‌ ఉన్నట్లు పేర్కొంది. విదేశాంగశాఖ మాజీ మంత్రి జెరెమీ హంట్‌, భారత సంతతికి చెందిన హోం మంత్రి ప్రీతి పటేల్‌ పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. వివిధ బెట్టింగ్‌లను పోల్చి చూసే ‘ఆడ్స్‌చెకర్‌’ సైతం బోరిస్‌ వారసుల రేసులో రిషి సునాక్‌ ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని