అగ్నిపర్వత విస్ఫోటం.. సునామీ..

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఒక భారీ అగ్నిపర్వతం బద్ధలై ఈ ప్రాంతం మొత్తం తీవ్ర కలకలం సృష్టించింది. టోంగా అనే చిన్నద్వీప దేశానికి సమీపంలో చోటుచేసుకున్న ఈ విస్ఫోటం వల్ల సునామీ కెరటాలు విరుచుకుపడ్డాయి. జపాన్‌ నుంచి

Updated : 17 Jan 2022 06:03 IST

పసిఫిక్‌ మహాసముద్రంలో కలకలం
వణికిన టోంగా దీవి
చుట్టూ ఆవరించిన ధూళి మేఘం
నిలిచిపోయిన కమ్యూనికేషన్‌ సేవలు
నష్టంపై ఇంకా అస్పష్టత

వెల్లింగ్టన్‌: దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఒక భారీ అగ్నిపర్వతం బద్ధలై ఈ ప్రాంతం మొత్తం తీవ్ర కలకలం సృష్టించింది. టోంగా అనే చిన్నద్వీప దేశానికి సమీపంలో చోటుచేసుకున్న ఈ విస్ఫోటం వల్ల సునామీ కెరటాలు విరుచుకుపడ్డాయి. జపాన్‌ నుంచి అమెరికా వరకూ పసిఫిక్‌ తీర ప్రాంతం మొత్తాన్నీ ఈ అలలు ముంచెత్తాయి. వీటి ధాటికి టోంగా రాజధాని నుకుఅలోఫా దెబ్బతింది. అక్కడ కమ్యునికేషన్‌ సేవలు దెబ్బతినడంతో నష్టం తీవ్రత ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం సునామీ ముప్పు శాంతించినప్పటికీ అగ్నిపర్వత విస్ఫోటం ధాటికి ఆకాశంలో ఏర్పడ్డ ధూళి మేఘం ఇంకా కొనసాగుతోంది.

‘హుంగా టోంగా హుంగా హా అపై’ అనే ఈ అగ్నిపర్వతం.. నుకుఅలోఫాకు 64 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం అది విస్ఫోటం చెందింది. దీనివల్ల పుట్టగొడుగు ఆకృతిలో బూడిద, నీటి ఆవిరి, వాయువులు పసిఫిక్‌ సాగర జలాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా పైకి ఎగిసినట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఈ విస్ఫోట శబ్దం.. 10వేల కిలోమీటర్ల దూరంలోని అలస్కా వరకూ వినిపించడం గమనార్హం. ఇది 5.8 తీవ్రతతో కూడిన భూకంపంతో సమానమని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. విస్ఫోటం వల్ల వెలువడిన బూడిద.. ఆకాశంలో దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తువరకూ ఆవరించింది. పేలుడు ధాటికి సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. టోంగాతో పాటు జపాన్‌, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, చిలీ, అలస్కా సహా అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్‌ పసిఫిక్‌ తీర ప్రాంతంలో అలలు 1.2 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయి. వీటివల్ల పడవలు, తీరంలోని నిర్మాణాలు దెబ్బతిన్నాయి. తీవ్ర నష్టం మాత్రం జరగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

టోంగాలో ఇళ్లలోకి నీరు..
సునామీ అలల వల్ల టోంగాలో ఇళ్లల్లోకి నీరు చేరింది. అక్కడి తీర ప్రాంతాన్ని భారీ కెరటాలు ముంచెత్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ వీడియోలో వెల్లడైంది. ఆ దీవిలో  ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో తమవారి క్షేమ సమాచారం తెలియక ప్రపంచవ్యాప్తంగా ఉన్న టోంగా జాతీయులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే అక్కడ ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్‌ తెలిపారు. రాజధాని నుకుఅలోఫాను దట్టమైన ధూళి ముంచెత్తిందన్నారు. దీనివల్ల అక్కడ నీరు కలుషితమైందని చెప్పారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు సురక్షిత తాగు నీరు అత్యవసరమన్నారు. నష్టాన్ని అంచనావేసేందుకు విమానం ద్వారా చేసిన ప్రయత్నానికి ధూళి మేఘం ఆటంకంగా మారిందని చెప్పారు. సోమవారం మరోసారి ప్రయత్నిస్తామన్నారు. వాయు, సముద్ర మార్గాల గుండా టోంగాకు అత్యవసర సరఫరాలు అందిస్తామని చెప్పారు. టోంగాను ఆదుకునేందుకు సిద్ధమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. టోంగాలో దాదాపు లక్ష మంది నివసిస్తున్నారు. హుంగా టోంగా హుంగా హా అపై అగ్నిపర్వతానికి 2014 చివర్లో, 2015 మొదట్లోనూ విస్ఫోటం చెందింది. దానివల్ల వెలువడిన చిన్నపాటి రాళ్లు, బూడిద క్రమంగా సముద్రంపై పడి ఒక కొత్త దీవి ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని