
Shopping: రూ.లక్షన్నరతో రెండేళ్ల పిల్లాడి షాపింగ్
వీడియో గేమ్స్ ఆడుకునేందుకు తల్లి స్మార్ట్‌ఫోన్ తీసుకున్న రెండేళ్ల బాలుడు.. పొరపాటున 1700 డాలర్లు(సుమారు లక్షా 27వేల రూపాయలు) విలువైన ఫర్నిచర్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. ప్రమోద్ కుమార్-మధు.. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు. ఇటీవలే న్యూజెర్సీలో సొంతింటి కల సాకారం చేసుకున్నారు. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని మధు అనుకున్నారు. వాల్‌మార్ట్ యాప్‌లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ.. కొన్నింటిని కార్ట్‌లో యాడ్ చేశారు. నెమ్మదిగా ఆర్డర్ చేద్దామని నిర్ణయించుకున్నారు. అనూహ్యంగా వాల్‌మార్ట్ నుంచి పార్సిల్స్ రావడం మొదలయ్యాయి. ఏంటా అని యాప్ చూసిన ప్రమోద్-మధుకు అసలు విషయం బోధపడింది. ఇదంతా తమ కుమారుడైన అయాన్ష్ చేసిన పనేనని అర్థమైంది. ‘‘అయాన్ష్ యాప్ ఓపెన్ చేశాడు. కార్ట్‌లో యాడ్ చేసి ఉన్నవాటన్నింటినీ ఆర్డర్ చేశాడు. పేమెంట్స్ అన్నీ పూర్తయిపోయాయి’’ అని ప్రమోద్ తెలిపారు. అయాన్ష్ వల్ల పొరపాటు జరిగిందంటూ ఆ దంపతులు వాల్‌మార్ట్‌ను ఆశ్రయించారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ అవసరం లేని వస్తువులు రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది.