ఒమిక్రాన్‌పై ప్రస్తుత ఔషధాల పనితీరు భేష్‌

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్‌-19 ఔషధాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అత్యంత ప్రభావంగా పనిచేస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, యాంటీబాడీ చికిత్సలు మాత్రం ఈ వేరియంట్‌ బాధితులపై అంతగా పనిచేయడం లేదని తేలింది.

Published : 28 Jan 2022 04:27 IST

యాంటీబాడీ చికిత్సల ప్రభావం అంతంత మాత్రమే
తాజా అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్‌-19 ఔషధాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అత్యంత ప్రభావంగా పనిచేస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, యాంటీబాడీ చికిత్సలు మాత్రం ఈ వేరియంట్‌ బాధితులపై అంతగా పనిచేయడం లేదని తేలింది. కొన్నిరకాల యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతున్నట్టు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌-మాడిసన్‌కు చెందిన వైద్య పరిశోధకుడు యోషిహిరో కవాకా ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ అందించింది.

‘‘మిగతా వేరియంట్లు, ఒమిక్రాన్‌ సోకిన వారికి వివిధ కొవిడ్‌ చికిత్సలు ఎలా పనిచేస్తున్నాయన్న విషయమై అధ్యయనం సాగించాం. ఒమిక్రాన్‌ పుట్టుకురావడానికి ముందే... కొవిడ్‌ నియంత్రణకు పలురకాల ఔషధాలు, యాంటీబాడీ థెరపీలను వైద్య నిపుణులు సూచించారు. కొత్త వేరియంట్‌లో మ్యూటేషన్లు విభిన్నంగా ఉండటంతో... ఈ ఔషధాలు, చికిత్సలు ఎంతవరకూ పనిచేస్తాయన్న ఆందోళన నెలకొంది.

దీంతో జపాన్‌కు చెందిన జాతీయ సాంక్రమిక వ్యాధుల పరిశోధన సంస్థ నిపుణులతో కలిసి.. వుహాన్‌, ఇతర ముఖ్యమైన వేరియంట్లపై వీటి పనితీరును తెలుసుకునేందుకు ప్రయత్నించాం. ప్రయోగశాలలో చేపట్టిన పరీక్షల్లో... మోల్నుపిరావిర్‌, రెమిడెసివిర్‌ ఔషధాలు ఒమిక్రాన్‌ సహా అన్ని వేరియంట్లపైనా ఒకే విధంగా పనిచేస్తున్నట్టు గుర్తించాం.

ఫైజర్‌ సంస్థ తయారుచేసిన పాక్స్‌లోవిడ్‌ మాత్ర, ఇంజక్షన్లు.. గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ రూపొందించిన సోట్రోవిమాబ్‌, ఆస్ట్రాజెనికా సంస్థ తయారుచేసిన ఎవిషెల్డ్‌ ఔషధం ఒమిక్రాన్‌ బాధితులకు ఎక్కువ మోతాదులో అవసరమవుతాయని గుర్తించాం’’ అని యోషిహిరో వివరించారు. ఇవన్నీ ప్రయోగశాల స్థాయి ఫలితాలేనని, క్షేత్రస్థాయి ప్రయోగాల్లో భిన్న ఫలితాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని